Sunday, July 24, 2011

యదా యదా హి ధర్మస్య....

గమనిక : ఈ పోష్ట్ లోని పాత్రలు కల్పితం కాదు. ఈ పాత్రలు రాష్ట్రం లో ప్రముఖులను పోలి ఉండటం కాకతాళీయం కూడా కాదు. అలా పోలికలు కనిపించని ఎడల నేను బాధ్యుడను కాను.. కనిపించిన ఎడల ప్రజలందరూ బాధ్యులే.. :P

"యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి బారత
అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం

పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే "

స్థలం : హైదరాబాదు మహానగరం లో ఒక బ్యాచిలర్ రూం.
సమయం : రాత్రి 9.00

కిక్ సినిమా నూటా ముప్పై మూడో ఓ సారి చూస్తూ పడి పడి పడి నవ్వుతున్నాడు సుబ్బారావు. ఎంతలా లీనమైపోయాడంటే బయట కాలింగ్ బెల్ మోగుతున్న శబ్ధం కూడా వినపడనంత.... ఆ కాలింగ్ బెల్ మోగిస్తున్న శాల్తీ వెంకట్ రావు విసుగొచ్చి తలుపు దబదబా బాదాడు. అప్పుడు లేచి తలుపు తీసాడు సుబ్బారావు.
ఎదురుగా కనిపించిన వెంకట్ రావు ని ఆశ్చర్యం తో " ఎన్నాళైంది రా నిన్ను చూసి ..మూడేళ్ళ క్రితం స్టేట్స్ వెళ్ళావు.. మళ్ళీ ఇప్పుడూ ప్రత్యక్షం.. " అని పలకరిస్తూ చేతిలో సూట్ కేస్ ని తీసుకున్నాడు..
వచ్చి సోఫాలో కూర్చొని టివి వంకచూసిన వెంకట్ , టివి లో వస్తున్న కిక్ సినిమా చూసి ఈ సినిమాల పిచ్చి ఇంకా తగ్గలేదా నీకు..కాసేపు న్యూస్ పెట్టు. మూడేళ్ళయింది ఏమి జరుగుతుందో మన రాష్ట్రం లో కాస్తా చూద్దాం " అన్నాడు వెంకట్..
"ఎందుకొచ్చిన న్యూస్ రా.. చూసావంటే మళ్ళీ అమెరికా పారిపోతావ్ వద్దు" అన్నాడు సుబ్బారావ్..
ఓ నిర్లక్షపు చూపు విసిరి సుబ్బారావ్ చేతిలో టివి రిమోట్ లాక్కొని టివి 9 పెట్టాడు వెంకట్..

ఎవరో ఒక అతను ఆవేశం గా గొంతు చించు కుంటున్నాడు.. "అవసరమైతే ఆత్మాహుతి దాడులు చేస్తాం ..దేహం ముక్కలైనా వెనక్కి తగ్గేది లేదు.. "
"ఈ టివి వాళ్ళకి మరీ పనీ పాటా లేనట్టుంది రా.. ఏకం గా టెరరిస్టుల లైవ్ మీటింగ్ చూపెడుతున్నాడు " అన్నాడు వెంకట్..
కిసుక్కున నవ్వాడు సుబ్బారావు.. "అది టెరరిస్టుల లైవ్ మీటింగ్ కాదు.... మన రాజకీయ నాయకులే.. ఆ మాట్లాడే వాడు ఎమెల్యే..."
"ప్రజా ప్రతినిధులు అయి ఉండి ఆ భాషేంట్రా.. " ఆశ్చర్య పోయాడు వెంకట్..

ఆ టెరరిస్టుల బాష వినలేక చానెల్ మార్చాడు వెంకట్.. ..

అక్కడ ఓ వ్యక్తి ఢిలీ ఏపి భవన్ లో మరో వ్యక్తిని చితక బాదుతున్నాడు.. ఆ కొట్టే వక్తి చుట్టూ మరికొంత మంది గులాబీ కండువాలతో ప్రోత్సహిస్తున్నారు... ఓ పది మంది మంది పోలీసులు నిలబడి చోద్యం చూస్తున్నారు......
"అయ్యో అయ్యో అదేంటిరా ఒక్కడి ని అలా పబ్లిక్ గా కొడుతుంటే చోద్యం చూస్తున్నారు ? " బాధపడిపోయాడు వెంకట్.. ...
"ఆ కొట్టే వాడు ఒక ఎమెల్యే.. వాళ్ళు అలా ఉద్యమం ముసుగులో ఎవరి పైనైనా చెయ్యి చేసుకుంటారు.. మొన్నటికి మొన్న అసెంబ్లీ ముందే మరో ఎమెల్యే ని వీళ్ళు ఉతికి ఆరేసారు.. అంతా అయిన తరువాత ఉద్యమ ఆవేశం లో ఇలాంటివన్నీ మామూలే.. చూసీ చూడనట్టు పోవాలె అనేస్తారు.. ప్రభుత్వం, పోలీసులు వీళ్ళని ఏమీ చెయ్యరు.. చెయ్యలేరు.. " మామూలు గా చెప్పుకుంటూ పోయాడు సుబ్బారావు..

ఈ సారి మరో చానెల్..... ఏదో యూనివర్సిటి లాగుంది.. విద్యార్థులు రాళ్ళు విసురుతున్నారు.. పోలీసులు విచ్చలవిడి గా లాఠీ చార్జి చేస్తున్నారు. విద్యార్థులంతా వీరావేశం లో ఊగిపోతున్నారు....
" సంవత్సరం నుండి ఇదే గోల.. ఎంత మంది విద్యార్థుల భవిశ్యత్ నాశనం అవుతుందో.. రాజకీయనాయకుల అవసరాల కోసం విద్యార్థులను రెచ్చ గొడుతున్నారు....." అని చెబుతు మరో చానెల్ మార్చాడు సుబ్బారావు..

మరో చానెల్ - ట్యాంక్ బుండ్ మీద వేలల్లో జనాలు.. కొందమంది పూనకం వచ్చిన వాళ్ళలా మహనీయుల విగ్రహలు పగలగొడుతున్నారు.. ఇన్సెట్ లో ఒక ప్రొఫెసర్ వాళ్ళని మరింత రెచ్చగొడుతున్నారు.. " ఉద్యమ ముసుగు లో మరో కోణం. ఆయన పేరుకే ప్రొఫెసర్.. తాలిబన్ లీడర్ లా జనాలని రెచ్చగొడుతాడు.. విద్యార్థులను ఆత్మహత్యలకి ఉసిగొల్పుతాడు.. అయినా ఎవరూ ఆయనని ప్రశ్నించలేరు.. ప్రశ్నిస్తే కొడతారని భయం.. " చెప్పాడు సుబ్బారావ్..


ఈ సారి రాజ్ చానెల్ పెట్టాడు.. భాగో.. జాగో అంటూ ఒకడు, తెచ్చుడో, దంచుడో అంటూ ఇంకొకడు.. తలలు తెగి పడాలె , రక్తం ఏరులై పారాలే, అడొచ్చినోళ్ళను అడ్డం గా నరికేస్తా, మగతం గురించి మాట్లాడుతావా, అదేంటో చూపిస్తాం దమ్ముంటే హైదరాబాద్ కి రా.. అంటూ ఒక్కోళ్ళు ఒక్కో డైలాగ్ చెబుతున్నారు..
" ఈ ప్రోగ్రాం ఏంటో భలే ఉందే.. బాలయ్య డైలాగ్స్ కాంపిటీషనా.. " అమాయకం గా అడిగాడు వెంకట్.. ...
"వార్నీ అమాయకత్వాన్ని అమ్మాకానికి పెట్టా.. అవి సినిమా డైలాగులు కాదురా.. .. మన ప్రజా ప్రతినిధుల డైలాగులు.. వాళ్ళది వాళ్ళకి ఇవ్వకపోతే ఏం జరుగుతుందో చెబుతున్నారు.. "
అది విని బుర్ర తిరిగి పోయింది వెంకట్ కి.. " ఒకపుడు ఎవరైనా చిన్న రెచ్చగొట్టే మాట మట్లాడిన కేసులు పెట్టి బొక్క లో ఏసే వాళ్ళు కద రా.. ఇప్పుడేంటి.. ఇంతలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నా ప్రభుత్వం ఏమీ చెయ్యటం లేదు? "
సమాధానం చెప్పకుండా చానెల్ మార్చాడు సుబ్బారావు.. అక్కడ ఓ వ్యక్తి ప్రశాంతం గా ఫిడేల్ వాయిస్తున్నాడు... అది చూపించి కళ్ళ తో సైగ చేసాడు సుబ్బారావ్...
"అర్థమైంది రా ఈ ప్రభుత్వం రోం తగలబడుతుంటే ఫిడేల్ వాయిస్తున్న నీరో చక్రవరి లా ఉంది అని సింబాలిక్ గా చెప్పావ్ అంతే నా ? " అడిగాడు వెంకట్... కళ్ళతోనే మెచ్చుకున్నాడు సుబ్బారావు వెంటనే అర్థం చేసుకున్నందుకు..

ఈ గొడవలు కాకుండా ఇంకేదైనా చూపించరా అడిగాడు వెంకట్..
మరో చానెల్.. ... అక్కడ కొంత మంది వ్యక్తులు రకరకాల కండువాలతో ఒక గోడ మీద అటో కాలు ఇటో కాలు వేసి కూర్చొన్నారు. తలలు అటు వైపులు ఇటు వైపుకి మార్చి మార్చి చూస్తూ.. " టెన్నీస్ మ్యాచా..అటు ఇటు తలలు తిప్పుతున్నారు... అన్ని పార్టీల అధ్యక్షులూ వచ్చినట్టున్నారు కదా? ఏదైనా స్పెషల్ మ్యాచా? " అడిగాడు వెంకట్....
"కాదు రాజకీయ మ్యాచ్.. వీళ్ళది రెండు కళ్ళ పాలసీ.. రెండు వైపుల రెచ్చగొడుతూ రాజకీయ మ్యాచ్ చూస్తున్నారు.. ఎవరో ఒకరు గెలిస్తే అప్పుడు వాళ్ళ వాదనని సమర్థిస్తారు.. " చెప్పాడు సుబ్బారావు....


తరువాత చానెల్ సాక్షి..... ఓ యువకుడు ఈ గొడవలు, ప్రజల బాధలు అన్ని వదిలేసి, మైకు పట్టుకొని ఏడుచుకుంటూ వూళ్ళు, కొండలు, గుట్టలు, పుట్టలు అన్నీ తిరుగుతున్నాడు... అతను ఎక్కడకి వెళ్ళినా సెంటిమెంటు సీనులే... ఆ యువకుడుకి దీవిస్తున్న ముసలవ్వ.. , యువకుడు ఎవరెవరినో ఓదారుస్తున్నడు.. వాళ్లంతా తిరిగి ఆ యువకుడుని ఓదారుస్తున్నారు.. ఒకరి చెంపలు ఒకరు పట్టుకొని చెమ్మగిల్లిన కన్నులతో ఆర్ధ్రమైన చూపులతో ... దానికి తోడు గుండెల్ని కదిలించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ " రాజు వయ్యా.. యువరాజు వయ్యా.. " తో మంచి సెంటిమెంట్ సినిమా లాగా ఉంది..

"ఏమి సినిమా రా ఆడు కొత్త హీరోనా.. చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు.. " అడిగాడు వెంకట్...


"కాదు రా బాబూ.. ఆయన చనిపోయిన సిఎం కొడుకు.. నాయన పదవి అడ్డుపెట్టుకొని సంపాదించిందంతా ఇప్పుడు సిబిఐ వాళ్ళు అట్టుకొపోతారేమో అని బెంగ, సిఎం కుర్చి దొరకలేదన్న దిగులు తో ఏడుస్తున్నాడు.. ఆయన అభిమానులేమో ఈ యనకి పదవెప్పుడొస్తుందో ఎప్పుడు దోచుకుందామో తెలియక ఏడుస్తున్నారు.. అలా ఒకరిని ఒకరు ఓదార్చుకుంటున్నారు.. " చెప్పాడు సుబ్బారావ్....

"ఓ ఈయనేనా యువరాజా వారు.. వేల కోట్లు ప్రజల సొమ్ము మింగినా ఇంకా ఏడుపెందుకో.. " అన్నాడు వెంకట్..


ఇక లాభం లేదని టివి కట్టేసి "అసలు గీత లో క్రిష్ణుడు ఏమి చెప్పాడొ తెలుసా.. ?" సుబ్బారావు ని అడిగాడు వెంకట్...

ఆలోచించి అన్నాడు సుబ్బారావు.. " గీత సినిమా లో క్రిష్ణుడు ఎక్కడ ఉన్నాడు రా? ఉన్నది రిషి , సాయి కుమార్ లే కదా ?"

"నీకెప్పుడు సినిమాల గోలే... నేను అన్నది గీత సినిమా కాదు.. భగవద్గీత.. " చెప్పాడు వెంకట్..

"ఏమో రా... నే పెద్దగా చదువుకోలే.. నువ్వే చెప్పు" అన్నాడు సుబ్బారావు..

"యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి బారత
అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం

పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే "

నోరెళ్లబెట్టి చూస్తున్న సుబ్బారావ్ ని చూసి కొనసాగించాడు వెంకట్... " అంటే ధర్మమునకు హాని కలిగినప్పుడు, అధర్మము పెచ్చరిల్లినపుడు నన్ను నేను సృజించుకొందును, అనగా సాకార రూపము తో ఈ లోకమున నేను అవతరింతును " అని శ్రీ క్రిష్ట్నుడు భగవద్గీత లో చెప్పాడు రా...

ఇంకా అలాగే చూస్తున్న సుబ్బారావ్ ని పట్టించుకోకుండా చెప్పుకుంటూ పోయాడు వెంకట్.. " ఆ నాడు దుష్ట పాలకుడైన కంసుడిని వధించటానికి అవతరించిన శ్రీ క్రిష్ణుడు.. ఈ రోజు వేలాది కంసులు వికటాట్టహాసం చేస్తుంటే ఎందుకు మళ్ళి అవతరించలేదు.. ? ప్రజా ప్రతినిధులైన వీళ్ళు ప్రజలని హింసిస్తూ, దోచుకుంటూ, రెచ్చగొడుతూ నానా బీభత్సం చేస్తుంటే ఇంకా ఎందుకు అవతరించలేదు? ఆ నాడు ధర్మం మూడు పాదాల మీద నడుస్తున్నా , నాలుగు పాదాల మీద నిలబెట్టటానికి అవతరించిన దేవుడు ఈ రోజు ఒక్క పాదం మీద కూడా నిలబడని ధర్మాన్నీ రక్షించటానికి ఎందుకు అవతరించలేదు ? " ఆవేశం గా ప్రశ్నించాడు వెంకట్. పక్కన ఉలుకు పలుకు లేకపోయే సరికి పక్కకి చూస్తే అప్పటికే నిద్రలోకి జారుకున్నాడు సుబ్బారావు..

వెంకట్ కి ఎంత సేపటికీ నిద్ర పట్టలేదు.. ఈ విషయమే దీర్ఘం గా ఆలోచిస్తూ
"యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి బారత
అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం

పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే " అన్న శ్లోకం మళ్ళీ మళ్ళీ నెమరువేసుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు...

**********************************

స్థలం : శేషతల్పము, క్షీరసాగరం
సమయం : వెంకట్ రావు పదే పదే భగవత్ గీత లోని శ్లోకాన్ని వల్లె వేస్తున్న వేళ.

లక్ష్మీ దేవి శ్రీ మహా విష్ణువు పక్కన కూర్చొని ఏవో కబుర్లు చెబుతోంది.. శ్రీ మహా విష్ణువు కి ఇవేమీ చెవిలో ఎక్కటం లేదు.. చాలా అన్యమస్కం గా ఉన్నాడు.. ఇది గమనించిన లక్ష్మీ దేవి "ఏమైంది స్వామీ , అలా ఉన్నారు అని అడిగింది ? "
"ఏమీ లేదు దేవీ.. భూలోకం లో ఒక నర మానవుడు నన్ను పదే పదే ప్రశ్నిస్తూ నా మనసును అల్లకల్లోలం చేస్తున్నాడు.. ఆంధ్ర రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయి, ధర్మం అనే పదానికి అర్థం లేకుండా పోయినా, ప్రజను పట్టించుకొనే పాలకులే కరువైపోయినా పూర్తిగా అధర్మం రాజ్యమేలుతున్నా ఇంకా నేను ఎందుకు అవతరించలేదని గుచ్చి ప్రశ్నిస్తున్నాడు దేవీ... ద్వాపర యుగం లో నా ఎనిమిదవ అవతారమైన శ్రీక్రిష్ణావతారం లో భగవద్గీత లో చెప్పిన విషయాలు గుర్తు చేస్తున్నాడు దేవీ.. "

"ఆ నరమానవుడు అడిగినదానిలో తప్పేముంది స్వామీ.. అసలు ఆంధ్ర రాష్ట్రం లోనే కాదు, మొత్తం భరత దేశం లో సామాన్యులు అష్ట కష్టాలు పడుతున్నారు, పాలకులు అందిన కాడికి దోచుకుంటున్నారు.. కానీ మీరు మరీ బెల్లం కొట్టిన రాయి లా ఉన్నారు స్వామీ.. మీ పదకొండవ అవతారం తో ఆ రాష్ట్రాన్నీ దేశాన్నీ కాపాడండి స్వామీ..లేదంటే మళ్ళీ నేను అలిగి భూలోకానికి వెళ్ళిపోవలసి వస్తుంది జాగ్రత్త.." అంది లక్ష్మీ దేవి ఒకింత కినుక వహిస్తూ..
"అంత పని చెయ్యకు దేవీ... కానీ నాకు తక్షణ కర్తవ్యమేమిటో బోధపడటం లేదు దేవీ.. ఇక్కడ ఎవరిది ధర్మం? ఎవరిది అధర్మం ? అని తేల్చికోలేని ధర్మ సంకటం లో ఉన్నాను.. " అన్నాడు మహా విష్ణువు.
"ఇందులో సంకటమేముంది స్వామీ.. ప్రజలదే కదా ధర్మం? .." ఆశ్చ్యర్యం గా అడిగింది లక్ష్మీ దేవి....
" కాదు దేవీ.. అదే భగవద్గీత లో మరొక్క విషయం కూడా చెప్పి ఉన్నాను.. కర్మ చేయకపోవటం విదుక్త ధర్మాని వదలి వేయటం పాపం గా నే పరిగణింపబడుతుంది. "

" దీనికి ప్రజల వైపున్న ధర్మం కి సంబంధం ఏమిటి స్వామీ.. " అడ్డుకుంది లక్ష్మీ దేవి....

చిరునవ్వు తో కొనసాగించాడు శ్రీ మహా విష్ణువు " ఉంది దేవీ.... భరత దేశం లో ప్రజలకు వాళ్ల నాయకులని ఎన్నుకొనే హక్కు ఉంది. వాళ్ళు ఎలాంటి వాళ్లను ఎన్నుకుంటారో అది వాళ్ళ ఇష్టం.. చాలా మంది ప్రజలు ప్రజాప్రతినిధులను ఎన్నుకోవలసిన సమయం లో వాళ్ళ వోటు వెయ్యకుండా ఉంటున్నారు. అంటే కర్మ చెయ్యక పోవటం.. ..
మరి కొంత మందు ప్రలోభాలకు లోనై సరైన వ్యక్తి ఎన్నుకోకపోవటం - అంటే ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించకపోవటం. ..."

"నారాయణ ... నారాయణ... స్వామి వారు చెప్పింది నిజమే అమ్మా.. " అంటూ లోనికి వచ్చాడు నారద మహర్షి...
"ప్రణామములు మునీంద్రా.... ? ఏమిటి భూలోక విశేషాలు ? ..." ఆసక్తి గా అడిగింది లక్ష్మీ దేవి..
ఏమున్నాయి తల్లీ.. మానవులు అవినీతి పరులని, దుష్టులని ప్రలోభాలకి లొంగి అందలమెక్కిస్తున్నారు. మరి కొందరేమో మాకెందుకు వచ్చినది లే అని మిన్నకుంటున్నారు. ప్రజలను దోచుకున్న వాళ్ళకు మరిన్ని వోట్లు వేసి గెలిపిస్తున్నారు.. ఇంకా దోచుకోమని ప్రోత్సహిస్తున్నారు.. ప్రజల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళని లక్షల వోట్లతో గెలిపిస్తున్నారు.. స్వామి వారు చెప్పినట్టు వారి కర్మలను వాళ్ళు సరిగా నిర్వరించక చేతులారా చేసుకున్నదే అమ్మా ఇదంతా..పాపం చేసినప్పు పాపఫలం అనుభవించక తప్పదు కదమ్మా.. " అన్నాడు నారద మహర్షి..

"అవును దేవీ.. ధర్మో రక్షతి రక్షితః... ధర్మాన్ని రక్షైంచాలి అప్పుడే అది ప్రజలని కాపాడుతుంది. కానీ ఆ ప్రజలు ధర్మాన్ని రక్షించటం లేదు.. ఆ దేశ , రాష్ట్ర ప్రజలు వాళ్ళ కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తించినచో ధర్మం దానికదే నిలబడుతుంది... "యతో ధర్మస్తతో విష్ణుః " నా అవతారాల్లో సూక్ష్మం అదే దేవీ.. " అని చిరునవ్వుతో ముగించాడు శ్రీ మహావిష్ణువు..

"అర్థమైంది స్వామీ ... " అని చిరునవ్వు తో నమస్కరించింది లక్ష్మీదేవి..

ఉన్నటునండి ధడ్ మని పెద్ద శబ్ధం ... అంతా చీకటి.... వులిక్కి పడి లేచాడు వెంకట్ రావు.. ఒక నిమిషం ఏమీ అర్థం కాలేదు.. బయట ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం.. ఎక్కడో పిడుగు పడ్డట్టుంది.. కరెంట్ పోయింది... ఒక్క సారి తల విదిల్చి చుట్టు పరికించి చూడగా ఇదంతా కల అర్థం అయ్యింది... వెంకట్ కి..
తన ప్రశ్నలన్నిటికీ కలలో సమాధానం లభించటం తో తను చెయ్యాల్సిందేమిటో బోధపడటం తో తృప్తిగా నిద్ర కు ఉపక్రమించాడు..

ధర్మో రక్షతి రక్షితః

3 comments:

చిలమకూరు విజయమోహన్ said...

" ప్రజలు ధర్మాన్ని రక్షించటం లేదు.. ఆ దేశ , రాష్ట్ర ప్రజలు వాళ్ళ కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తించినచో ధర్మం దానికదే నిలబడుతుంది."
కలియుగం కరిగిపోయిన తర్వాతగానీ మనదేశంలో ఈ కోరిక నెరవేరేటట్లు లేదు.

రక్తచరిత్ర said...

Shankar Reddy :- చాలా మంది ప్రజలు ప్రజాప్రతినిధులను ఎన్నుకోవలసిన సమయం లో వాళ్ళ వోటు వెయ్యకుండా ఉంటున్నారు. అంటే కర్మ చెయ్యక పోవటం..
ఇలాంటి రాజకీయ నాయకులంతా మనం వోటు వెయ్యడం వల్లనే గెలిచారని దేముడు కూడా అనుకోవడం వింతల్లొకెల్ల వింత.నేను ఇప్పటిదాకా ఒక్కసారి కూడా వోటు వెయ్యలేదు.వెయ్యడానికి వెళితే "ఎన్ని సార్లు వోటు వేస్తావురా"?? అని బయటికి గెంటారు.
నేను చెప్పదలుచుకున్నది తమరికి అర్ధం అయ్యిందనుకుంటాను.
(manam cheyaalsina karma vere vaallu chesestunnaaru)
Sorry,It is not my intention to poke your opinions but bringing down the facts.

bujjidi said...

baga rasaaru ran jan...
okappudu ..
yadhaa raajaa tadhaa prajalu


ippudu

yadhaa prajalu tadhaa naayakulu .. alaa unnaaru