Tuesday, August 5, 2008

అగ్గిపెట్టుందా ?

నవోదయా లో తొమ్మిదో తరగతి చదివేటప్పుడు జీవితం తెలుగు సీరియళ్ళలాగా భారం గా సా..........గుతున్న రోజులు. త్రీ రోజెస్ యాడ్ లో లాగా మరీ రంగు రుచి, వాసనా లేని టీ లాంటి రోజులు.. అలాంటి రోజులలో బ్రహ్మి జీవితం లోకి ఇలియానా లాగా వచ్చింది science fair . ఆ సంవత్సరం గుంటుర్ జిల్లా లో మద్దిరాల నవోదయా లో జరుగుతుంది science fair . మా స్కూల్ నుండీ 15 మంది వెళ్ళవచ్చు. science fair అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక exibit తయారు చేసుకొని తీసుకు వెళ్ళాలి. ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు ( skits ) గట్రా కూడా వుంటాయి. మా స్నేహితుడి బలవంతం మీద ఏదొ ఓ సిల్లీ అయిడియా తొ ఒక exibit చేసా. ఆ exibit ని మా టీచర్లకి చూపిస్తే , 'సెలబ్రిటీ సిల్లీ ఫెలో ని చూసినట్టు ' చూసారు మా టీచర్లు. ఆ సిల్లీ చూపులను సింపుల్ గా సైడు చేసి, ఈ exibit ఏ కాకుండా నేను , నా ఫ్రెండు కలసి ఒక comedy skit వేస్తామని చెప్పి ఎలాగోలాగా వొప్పించి మొత్తానికి 15 మంది లో చోటు సంపాదించాను.

కట్ చేస్తే మరో వారం లో మదనపల్లి లో విజయవాడ బసు లో కోలాహలం గా బయలుదేరాము. (ఆటలో అరటి పండు లా ఇక చిన్న విషయం, దారిలో కడప బస్స్టాండ్ లో భోజనానికి ఆగాము. అక్కడ ఒక టి స్టాల్ పేరు, 18 సంవత్సరాలైనా నేను ఈ రోజుకి మరచి పోలేదు. దాని పేరు 'అమ్మాజాన్ బావాజాన్ హజరత్లాల్ కాకీషా మౌలానా టి స్టాళ్ అంత పెద్ద పేరు చూసి చాలా ఫన్నీ గా అనిపించింది. )
అలా తరువాతి వుదయం మద్దిరాల చేరాము. మద్దిరాల, చిలకలూరి పేట నుండీ కోటప్ప కొండకి వెళే దారిలో వుంటుంది. అక్కడ నవోదయా స్కూల్ దాదాపు నిర్మానుష్యమైన ప్రదేశం లో వుంటుంది. అటొ కిలోమీటరు, ఇటో కిలోమీటరు ఒక్క ఇల్లు కూడా వుండదు. మాకు వసతి స్కూల్ నుండి ఒక కిలోమీటరు తరువాత కొత్తగా కడుతున్న హాస్టల్ లో ఇచ్చారు. రోజూ ఒక స్కూల్ బసు వచ్చి ఉదయం మమ్ములని హాస్టల్ నుండీ పికప్ చేసుకుని వెళ్తుంది. సాయంత్రం భోజనాలు కూడా స్కూల్ లోనే అందరికీ. ఆ తరువాత బస్ లో మమ్ములని హాస్టల్ దగ్గర డ్రాప్ చేసే వాళ్ళు.

మొదటి మూడు రోజులు సాఫీ గానే గడచిపోయాయి. స్టాల్స్ లో మా exibits తో ఉదయం నుండీ సాయంత్రం 4 వరకు కూర్చొని, 4 నుండి 9 వరకు సాంస్కృతిక కార్యక్రమాల పోటీలలో పాల్గొనే వాళ్ళము. మా స్కూల్ ఆటల పోటీలు మూడో రోజే పూర్తైపోయాయి. సో నాలుగో రోజు సాయంత్రం 7 గంటలకే భోజనం చేసి హాస్టల్ కి నడచి వెళ్దామని ప్లాన్ చేసాము ఒక ఐదుగురు స్నేహితులుము.

శితాకాలపు చలి ప్రతాపం చూపించటం అప్పుడప్పుడే మొదలౌతుంది. రోడంతా చాలా నిర్మానుష్యం గా వుంది. అప్పుడప్పుడు వెళ్ళే ఒకటి అరా బసుల వెలుగు తప్పా అంతా చీకటే. అలాంటి పరిస్థితులలో మేము ఐదుగురం అలా నడచి వెళ్తూ వున్నము. ఇంతలో ఎదురుగ రోడ్డు మధ్యలో ముగ్గురు కూర్చొని వున్నారు. మమ్ములని చూడగానే వాళ్ళు మెల్లగా మా వైపు రావటం మొదలు పెట్టారు. కాస్త దగ్గరగా రాగానె వాళ్ళను చూస్తే అప్పుడే కాలేజీకి స్టూడెంట్స్ లాగా వున్నారు. వాళ్ళు వచ్చి మాకు అడ్డంగా నిలబడ్డారు. చూడగానే వాళ్ళు బాగా తాగి వున్నరని అర్థం అయ్యింది. చుట్టూ చీకటి, నిర్మానుషయమైన ప్రదేశం. అట్టి విపత్కర పరిస్థితులలో కూడా మాకు అస్సలు భయం వెయ్యలేదు (నిజమని నమ్మేశారా ఖామెడీగా.. ? ) .

ఇంతలో వాళ్ళల్లో ఒక్కడు నోటిలో సిగరేట్ పెట్టుకొని ఫైట్ మాస్టర్ రాజు లాగా వికృతంగా ముఖం పెట్టి 'అగ్గిపెట్టుందా ' ? అని అడిగాడు.
పాపం ఆ అడిగినవాడూ చాలా సీరియస్సుగానే అడిగాడు, కానీ మా ఫ్రెండు ఒక్కడికి అగ్నిపర్వతం లో క్రిష్ట్ణ దైలాగ్ గుర్తొచ్చినట్టుంది .. సో ఇదేదో కామెడీ వ్యవహారం అనుకున్నాడో లేక, మావాడి మనోభావాలు తీవ్రం గా దెబ్బతిన్నాయో (స్కూల్ పిల్లాడిని పట్టుకొని అగ్గిపెట్టుందా అంటే దెబ్బ తినవూ మరి.. ) తెలియదు కానీ మావాడూ క్రిష్ట్ణ స్తైల్లో ' మేము బీడీలూ సిగరెట్లూ తాగేవాళ్లలా కనిపిస్తున్నామా మీ కళ్ళకి ' అని కొంచెం వంకరగా అడిగాడు. మావాడి డైలాగ్ పూర్తికాకుండానే 'అగ్గిపెట్టుందా ' అని అడిగినవాడు జేబులోనుండి అగ్గిపెట్టె తీసి పుల్ల గీసాడు.

ఒక్కసారిగా నా కళ్ళముందు బుల్లి ఫ్లాష్ బ్యాకు.. అందులో అంతకు ముందు వేసవి సెలవులలో చూసిన 'ఎర్రమందారం ' సినిమా గుర్తు వచ్చింది. అందులో రాజేంద్రప్రసాద్ రాత్రి పూట వొంటరిగా రోడ్డు మీద నడచి వస్తుంటే విలన్ గ్యాంగ్ కూడా అచ్చు ఇలాగే 'అగ్గిపెట్టుందా ? ' అని అడగటం, సమాధానం చెప్పేలోపు పుల్ల వెలించటం ఆ తరువాత రాజేంద్రప్రసాద్ ని చంపేయటం అన్నీ ఫ్లాషు లాగా వెలిగాయి. క్షణాలలో మాకు సీను మొత్తం అర్థమైపోయింది. 'తిరిగేదే భూమి, కాలేదే నిప్పు , పోరాడే వాడే మనిషి, పాకేదే పాము, ఈదేదే చేప ' లాంటి జీవిత సత్యాలు చెప్పే పవన్ కళ్యాన్ సినిమాలు అప్పటికి లేవు కదా.. సో పోరాడటం పక్కనెట్టి, పరిగెట్టటం ప్రారంభించాము వాళ్లను ఒక తోపు తోసి. మావాడి వంకర డైలాగ్ విన్న వాళ్ళకి ఎక్కడో కాలటం తో వాళ్ళూ మా వెంట పడ్డారు. హార్స్లీహిల్స్ లో రోజూ వుదయం 5.00 కి చలిలో పరుగెత్తే సన్నివేశాలని గుర్తు తెచ్చుకొని స్పీడుగానే పరుగెత్తుతున్నాము. మాలో ఒక్కతను బాగా స్లో. ఇక కొన్ని క్షణాలలో మావాడు వాళ్ళకు దొరికిపోతాడనగా ఎదురుగా ద్రౌపతీ వస్త్రాపహరణం సీన్లో క్రిష్ట్ణుడు ప్రత్యక్షమైనట్టు ఒక్క ఎర్రబస్సు ఆ రోడ్డులో ప్రత్యక్షమైంది. ఆ బస్సు లైట్ల వెలుగు పడగా మా వెంట పడ్డవాళ్ళు ఆగిపోయారు. ఇదే అదనుగా వాళ్ళ నుండి తప్పించుకొని హాస్టల్ చేరిపోయాము. అలాంటి సీరియెస్ సీన్లో కామెడి డైలాగ్ వదిలిన మావాడిపై సుత్తి వీరభద్రరావు స్టైల్లో కాసేపు తిట్ల దండకం చదివాము.

ఇప్పుడు తలచుకుంటే ఈ సీను ఎంత ఫన్నీ గా అనిపిస్తుందో.....