Thursday, June 18, 2009

ఎక్స్ పిచ్చి వై పిచ్చి.. క్రికెట్ పిచ్చి.. Part 2

అప్పుడు స్టార్ట్ అయ్యింది మళ్ళి వరల్డ్ కప్.... ఆ మ్యాచ్లన్నీ ఎర్లీ మార్నింగ్ ఉండేవి.. సో ఎక్కడా టివి లు చూడటం కుదిరేది కాదు.... సో నేను ఒక చిన్న ట్రాన్సిస్టర్ సంపాదించా.... క్లాసులో కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చివరి బెంచీలో కూర్చొని కామెంటరీ వినే వాడిని.. ఆ వరల్డ్ కప్ లో సచిన్ ఓపెనర్ గా రావటం , ఫీల్డింగ్ రిస్ట్రిక్షన్స్ ని వాడుకొని మొదటి ఓవర్లలో చెలరేగిపోవటం , లాంటి చిన్న చిన్న ఆనందాలు తప్ప ఏమీ మిగలలేదు. ఇండియా వోడిపోవటం కన్నా పాకిస్తాన్ కి కప్ రావటం తో లైఫ్ లో మొదటి సారి క్రికెట్ అంటే విరక్తి కలిగింది.. (కొన్ని రోజులే ... ) అలా నవొదయ చదువులు అయిపోయి తిరుపతి లో ఎస్.వి ఆర్ట్స్ కాలేజి లో డిగ్రీ చేరినప్పుడు మొదటి క్రికెట్ బ్యాట్ కొన్నా 500 రూపాయిలు అయ్యిందనుకుంటా.. ఇక అప్పటి నుండి కాలేజి లో వేరే బ్యాచ్ వాళ్ళ్తో మ్యాచ్లు, దగ్గర వూళ్ళతో మ్యాచు పెట్టుకోవటం , ఎప్పుడూ పెద్దగా టోర్నమెంట్లు గెలిచింది లేదు కానీ బాగానే ఆడే వాళ్ళము..

ఆ తరువాత నెల్లురు లో MCA చేరిన తరువాత క్రికెట్ ఆడటం మరింత పెరిగింది. రోజూ సాయంత్రం YMC Ground లోనో లేక VRC gound లోనో ఆడే వాళ్ళము. ఇక మ్యాచ్లు చూడాలంటే మాత్రం ఏదో ఒక టివి షాపు ముందు తిష్ట వెయ్యటమే. మరీ ముఖ్య్హమైన మ్యాచ్ అయితే మాత్రం టివి రెంట్ కి తెచ్చుకొని కేబుల్ దొంగ కనెక్షన్ తీసుకొని చూసే వాళ్ళము.. మా బ్యాచ్ MCA లో చేరిన మొదటి సంవత్సరం జరిగిన కాలేజి యాన్యువల్ డే లో MCA మొదటి బ్యాచ్ కి MBA మొదటి బ్యాచ్ కి ఏవో గొడవలు జరిగాయి..ఆ దెబ్బతో తరువాతి సంవత్సరం కాలేజి డే జరపలేదు. మేము మూడో సంవత్సరానికి వచ్చేసరికి MCA సూపర్ సీనియర్ ఒకరు మా కలేజిలోనే లెక్చరర్ గా చేరారు. అదే విధం గా MBA మొదటి బ్యాచ్ అతనూ లెక్చరర్ గా చేరాడు.. ఆ సంవత్సరం ఎలాగైనా కాలేజి డే జరిపించాలని పట్టుబట్టి మా డైరెక్టర్ ని ఒప్పించాము. అందులో భాగం గా క్రికెట్ పోటీలు స్టార్ట్ అయ్యాయి. మొదటి గేం మాకు MBA కి జరగాల్సి ఉంది. నెల్లూరు ఏసి సుబ్బారెడ్డి స్టేడియం లో మ్యాచ్. నేను , ఆపోజిట్ టీం టాస్ కి వెళ్ళగానే MBA సీనియర్/లెక్చరర్ వచ్చి నేను ఉంటాను అపైర్ గా అన్నాడు. ఠాట్ వీల్లేదు , న్యూట్రల్ అంపైర్ ఉండాల్సిందే (MSc ) అయితే వాకే లేకుంటే వొప్పుకోను అన్నా.. మాటా మాటా పెరిగి MCA వాళ్ళందరిని గెంటేసి కాలేజి డే జరుపుకుంటాము అన్నాడు MBA సీనియర్. నీకంత సీన్ లేదు లే లైట్ తీసుకో అని మొత్తానికి న్యూట్రల్ అంపైర్ తో మ్యాచ్ స్టార్ట్ చేసాము.. మా టీం కి ఈ గొడవ విషయం చెప్పలేదు.. కానీ MBA టీం కి మాత్రం గొడవ తెలిసిపోయింది.. మ్యాచ్ అంతా రెచ్చగొట్టడాలు, ఆవేశాలతో నే జరిగిపోయింది. మేము వోడిపోయాము కూడా.. ఆ ఓటమి కోపం తో వెంటనే మా వాళ్ళకు మ్యాచ్ ముందు గొడవ చెప్పాను.. అంతే దెబ్బకి మళ్ళీ MCA Vs MBA గొడవలైపోయాయి.. మళ్ళీ కాలేజి డే క్యాన్సిలయ్యింది.. బహుశా అదే అనుకుంటా నేను ఆడిన లాస్ట్ మ్యాచ్.. ఆ తరువాత ఉద్యోగం రావటం ఎప్పుడో అడపా దడపా కాసేపు ఆడటం తప్పించి మ్యాచ్ లు ఏరోజూ ఆడలేదు..

2002 లో మొదటి సారి హైదరాబాద్ స్టేడియం లో ఇండియా జింబాబ్వే మ్యాచ్ చూసా.. ఆ వాతావరణమే నిజం గా ఓ గొప్ప అనుభూతి.. ఆ మెక్సికన్ వేవ్ లో ప్రత్యక్షం గా ఉండటం వావ్ అనిపించే అనుభూతి.. ఆ తరువాత లండన్ లో ఒక 20-20 మ్యాచ్ చూసా స్టేడియం లో.. లండన్ ఆఫీసులో పెద్ద పెద్ద టివి లు ఉండేవి.. పని చేసుకుంటూ టివి లో మ్యాచ్ లు చూస్తూ, మధ్యలో క్లైంట్లతోనే మ్యాచ్ అనాలసిస్లు నాలో క్రికెట్ పిచ్చి ని మరింత పెంచాయి..

2003 వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఇండియా వోడిపోయినప్పుడు క్రికెట్ ఇక ఎప్పటికీ చూడకూడదనుకున్నా.. ఈ క్రికెట్ పిచ్చి సంగతి తెలిసిందే కదా.. 2007 అతి దారుణమైన ఇండియా ఆట చూసి నిజం గానే కొన్ని నెలలు క్రికెట్ చూడకుండా ఉండిపోయా.. మళ్ళి యంగ్ జనరేషన్ తో వచ్చిన టిం, మొదటి టి20 వరల్డ్ కప్ గెలుపు తో నిన్నొదల బొమ్మాళీ అంటూ మళ్ళీ మొదలు.. ఈ సారి IPL ఎందుకో నాకు పెద్ద ఇంట్రెస్ట్ కలగలా.. బహుశా ఎన్నికల వేళవటం వల్లేమో.. ఇప్పుడు జరుగుతున్న టి20 వరల్డ్ కప్లో కూడా ఇండియా వోడిపోయినా పెద్దగా భాధ అనిపించలేదు.. ఒక వేళ నాలో క్రికెట్ పిచ్చి తగ్గుముఖం పడుతుందా ? రాబోయే విండీస్ టూర్ లో మనోళ్ళు అదరగొడితే మళ్ళీ "నిను వీడని నీడను నేనే.. " అంటూ వచ్చేస్తుందేమో..

India Is Our Nation, Cricket is Our Religion జైహింద్ :)

Wednesday, June 17, 2009

ఎక్స్ పిచ్చి వై పిచ్చి.. క్రికెట్ పిచ్చి.. Part 1




అదేంటో ఎంత వదిలించుకుందామన్నా ఓ పట్టాన వదిలి చావట్లేదు ఈ క్రికెట్ పిచ్చి.. ఇండియా గెలవగానే నాకు కోట్ల కొలదీ డబ్బు వచ్చినంత ఆనదం.. వోడిపోగానే కాసేపు(తరువాత మ్యాచ్ వరకే.. ) క్రికెట్ ఇంకెప్పుడూ చూడకూడదన్నంత విరక్తి.. మళ్ళీ తరువాతి మ్యాచ్ మొదలయ్యే సరికి మనసు పొరల్ని చీల్చుకుంటూ అదే పిచ్చి.. అసలు ఈ పిచ్చి ఎప్పుడు ప్రారంభం అయ్యిందా అని కాసేపు రింగులు తిప్పితే ఎన్నెన్నో తీపి గుర్తులు...


1987 లో అనుకుంటా ఓ సారి సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ కి మొదటి సారి కామెంట్రీ విన్నా.. అప్పట్లో క్రికెట్ గురించి పెద్దగా ఏమీ తెలియదు... కానీ ఆ మ్యాచ్ తో కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చింది. సెలవుల తరువాత మళ్ళి హాస్టల్ కి వెళ్ళిన తరువాత స్కూల్ లో మొదటి సారి క్రికెట్ కిట్ కొని ఆడటం మొదలెట్టారు. మొదట్లో ఎక్కువగా మా టీచర్లే ఆడే వారు.. (నవోదయా లో మాదే మొదటి బ్యాచ్, మాలో చాలా మందికి క్రికెట్ గురించి పెద్దగా తెలియదు అప్పటికి ) ఆట గురించి తెలుసుకొనే కొద్ది మరింత ఇంట్రెస్ట్ పెరిగింది.. అదే టైం లో వరల్డ్ కప్ రావటం అందులో ఇండియా మ్యాచ్లన్నీ ఎవరో ఒక టీచర్ ఇంట్లో లైవ్ చూడటం తో స్టార్ట్ అయ్యిందనుకుంటా ఈ క్రికెట్ పిచ్చి.. .. ఆ వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్ లో ఇంగ్లాండ్ తో మ్యాచ్ వోడిపోయినప్పుడు ఎంత బాధేసిందో.. .. అప్పుడు గవాస్కర్ మీద పిచ్చ కోపం వచ్చింది (ఆ మ్యాచ్ లో 4 పరుగులే చేసాడు)....


స్లోగా క్రికెట్ ఆడటం కూడా స్టార్ట్ చేసాము.. మా హిందీ మాస్టరు , పియీటి మేడం బాగా ఆడే వారు క్రికెట్.. ... మొదట్లో బ్యాట్ మోసే బలం కూడా ఉండేది కాదు.... అదీ కాక మొదటి నుండే టెన్నీస్ బాల్ కాకుండా కార్క్ బాల్ నే వాడే వాళ్లము, సో బాల్ ఎక్కడ తగులుతుందో అని భయం.. సో బ్యాటింగ్ జోలికి పెద్దగా వెళ్ళకుండా బౌలింగ్ నేర్చుకున్నా.. ..అప్పటినుండి దాదాపు 4 సంవత్సరాలు రోజూ సాయంత్రం 4 కి ఠంచనుగా క్రికెట్ కిట్ తో గౌండ్ లో ప్రత్యక్షం అయ్యేవాడిని...మాకు ప్రతి సంవత్సరం యాన్యువల్ డే సంధర్భం గా అన్ని గేంస్ పోటీలు జరిగేవి.. ( మా స్కూల్ మొత్తాన్ని 7 హౌసెస్ గా డివైడ్ చేసి దాని ప్రకారమే హాస్టల్ లో రూంస్, పోటీలు అన్ని ఉండేవి ) నవోదయా లో చెరిన మూడవ సంవత్సరం లో అనుకుంటా మొదటి సారి క్రికెట్ పోటీలు జరిగాయి. అప్పట్లో మా హౌస్ కేప్టెన్ కి నాకు మాటలు లేకపోయే సరికి నాకు టీం లో ప్లేసు దొరకలేదు.. కానీ మా పియిటి మేడం బలవంతం మీద నను చేర్చుకోక తప్పలేదు.. తరువాతి సంవత్సరం కి నేను వేరే హౌస్ మారి అక్కడ టీం కి కేప్టెన్ అయ్యా..ఆ సంవత్సరం మా టీం రన్నరప్ గా నిలిచింది... ఆ తరువాతి సంవత్సరానికి మా హౌస్ లో రాజకీయాలకీ నాకు టీం లో ప్లేసే గల్లంతు.. అదే టైం లో శ్రీకాంత్ పాకిస్తాన్ పర్యటన లో కేప్టెన్ గా వెళ్ళీ ఆ తరువాతి సీరిస్ కీ టీం లో ప్లేసు కోల్పోయాడు.... ఇదే మాట అని మా ఫ్రెండ్స్ తెగ వెక్కిరించే వాళ్ళు..

8 వ తరగతి అయిపోయిన తరువాత సెలవులకి వూరు వచ్చినప్పుడు మా వూళ్ళో కూడా ఓ క్రికెట్ టీం తయారయి వుంది.. ఓ సారి మా ఎదురింటబ్బాయి నన్ను పక్క వూరి తో మ్యాచ్ ఆడటానికి రమ్మన్నాడు. కానీ మా ఇంట్లో వొప్పొకోలేదు.. ఇక ఇంట్లో చెప్పకుండా వెళ్ళి మరీ మ్యాచ్ ఆడి వచ్చా..


ఈ టైం లో సచిన్ మీద (International Cricket లో కి అడుగు పెట్టడానికి సంవత్సరం ముందు ) ఓక పెద్ద ఆర్టికల్ వచ్చింది ఈనాడు స్పోర్ట్స్ పేజీలో... అది చదివిన రోజే ఎందుకో సచిన్ ఫానయిపోయా... ఆ తరువాతి సంవత్సరం పాకిస్తాన్ తో ఆరంగేట్రం చేసినప్పుడు ఓ మ్యాచ్ లో అబ్దుల్ ఖాదిర్ బౌలింగ్ లో హ్యాట్రిక్ సిక్సర్లు అసలు ఎప్పటికి మరచిపోలేనేమో...


10 వ తరగతి కి వచ్చే సరికి ఇంకో కొత్త పియిటి టీచర్ వచ్చి జాయిన్ అయ్యాడు.. ఈయనకు క్రికెట్ అంటే పడదు.. ఆ దెబ్బతో క్రికెట్ కి ఉన్న గౌండ్ ను బాస్కెట్ బాల్ , ఖొఖొ కోర్ట్స్ గా మార్చేసాడు...ఈయనకు మాకు అసలు పడేది కాదు... దానికి తోడు 10 వ తరగతి పబ్లిక్ ఎగ్జాంస్ కావటం తో మేము కొంత చదువు ధ్యాసలో పడ్డాము..... ఎంత పడ్డా ఎప్పుడు ఇండియా మ్యాచ్ జరిగినా చూడటం మాత్రం మిస్ అయ్యే వాళ్లము కాదు..అక్కడ ఉన్న మైక్రోవేవ్ స్టేషన్ లో, గవర్నర్ బంగళా లో, లేక జబ్బార్ షాపు అని చిన్న అంగడిలోనో చూసే వాళ్ళము.. ఇంటర్ మొదటి సంవత్సరం వచ్చే సరికి స్కూల్ లో క్రికెట్ ఆడటం కుదరక ఆ రూం ముందు పెద్ద స్థలం ఉంటే అక్కడ ఆడటం ప్రారంభించాము.. దీనికి ఆద్యుడు మా హరీష్.. ఎక్కడ పట్టాడొ ఒక మంచి బేస్బాల్ బ్యాట్ ఆకారం లో ఉన్న మంచి కర్ర పట్టుకొచ్చాడు..ఆ బ్యాట్ మీద ఆంబ్రోస్ అని చెక్కాడు (అప్పట్లో ఏదో మ్యాచ్ లో ఆంబ్రోస్ ఇండియా మీద ఒక భారీ సిక్సర్ కొట్టి ఇండియా గెలవాల్సిన మ్యాచ్ ని దూరం చేసాడు.. అది చూసి ఆంబ్రోస్ ఫానైపోయాడు.....) ఇక పాత సాక్స్లు ఉపయోగించి బాల్ తయారు చేసే వాళ్లము. మధ్యలో పేపర్లు చెత్త పెట్టి చేసే వాళ్ళము. మొదట్లో ఈ బాల్ కొంచెం మెత్త ఉండేది కాని రాను రాను గట్టి టెన్నీస్ బాల్ లాగా తయారు చెయ్యటం నేర్చుకున్నాము.... ఈ క్రికెట్ ఇన్స్టాంట్ సక్సెస్ అయ్యింది... ఇది మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేసాము.. ముందు రోజే ఎలా ఆడాలో ప్లాన్ చేసుకోవటం.. పేపర్ మీద ఫీల్డింగ్ ప్లాన్లు, టీం మీటింగులూ, టెస్ట్ మ్యాచ్ లు ఆడటం... అలా ఎంజాయ్ చేస్తున్న సమయం లో ...........

Monday, January 12, 2009

మా వూళ్ళో సంక్రాంతి


నాకు చాలా ఇష్టమైన పండుగ సంక్రాంతి. మా వైపు పెద్ద పండుగ అంటారు (పెద్దల పండుగ, అన్నిటికన్నా పెద్ద పండుగ అని రెండు అర్థాలు ) . ఇప్పుడు పెద్ద హడావిడి కనిపించటం లేదు కానీ, మా చిన్నప్పుడు చాలా సంబరం గా జరిగేది పండుగ మూడు రోజులు. ధనుర్మాసం ప్రారంభం తోనే పండుగ హడావిడి మొదలవుతుంది వూరిలో. అంతా కొత్త బట్తలు కొనటం , కుట్టించుకోవటానికి టైలర్ దగ్గర క్యూలు. ఇంకా ధనుర్మాసం మొదటి రోజు నుండి ఇళ్ళముండు పెద్ద పెద్ద ముగ్గులు, గొబ్బెమ్మలు, వాటి కి గుమ్మడి, తంగేడూ పూలతో అలంకరణలు వీటితోపాటే శితాకాలపు చలి , మంచు తో ఆ పల్లెటూరి అందాలు ద్విగుణీకృతం అవుతాయి. రోజూ స్కూల్ నుండి వచ్చేటప్పుడు దారిలో గుమ్మడి పూలు చాటుగా కోసుకు రావటం , ఎవరి ఇంటి ముందు ఎక్కువ గొబెమ్మలు , గుమ్మడి పూలు పెట్టరు అని పిల్లల మధ్య పందేలు ఇవన్నీ చాలా చాలా మంచి జ్ఞాపకాలు. ఇక భోగి ముందు రోజు సాయంత్రం స్కూల్ నుండి రాగానే చెరుకు తోటల లో పడి ఎండు చెరుకు ఆకులను మోపులుగా కట్టి తెచ్చి ఇంట్లో పడేయటం ఇంట్లో భోగి మంటలో వేయటానికి పనికి వచ్చే పాత సామాను అంతా పోగేయటం ఎప్పుడెప్పుడు ఉదయం అవుతుందా అని ఆత్రం గా ఎదురు చూడటం. ఉదయం మూడూ కి అంతా మా పెద నాన్న, తాత గారు నిద్ర లేపే వాళ్ళూ అందరినీ , మళ్ళీ ఎవరిది పెద్ద మంటా ఎవరిది చాలా సేపు కాలుతుంది అని మళ్ళి పందేలు. అప్పట్లో చలి కూడా బాగా ఉండేది సో భోగి మంట బాగా ఎంజాయ్ చెసే వాళ్లము. ఆ తరువాత చాకలి తో తలంటు, వాళ్ళ బలమంత చూపించి మర్దన చేసే వాడు. వొళ్ళంతా హూనమైయేది. ఇక ఆ నూనె జిడ్డూ మొత్తం పోవాలంటే గిన్నెడు కుంకుడు కాయరసం తో చేస్తే తప్ప వదిలేది కాదు. ఆ రోజంత ఇక పెద్దగా ఏమీ వుండేది కాదు ఏవో స్వీట్స్ వండటం తప్ప.రెండొ రోజు సంక్రాంతి, ఈ రోజు ఉదయం ఉపవాసం , మధ్యాహనం పూజ ఆ తరువాత చనిపోయిన పెద్దలకి బట్టలు పెట్తడం అయిన తరువాత భోజనాలు. సాయంత్రం పిల్లాంతా కలసి సరదాగా మామిడి తోటలోకో లేక చెరకు తోట కో వెళ్ళీ రేగు పళ్ళు కోసుకొని, కాలువలో నీళ్ళతో కాసేపు ఆడుకొని వచ్చే వాళ్ళము.
ఇక మూడో రోజు కనుమ, మా వైపు పశువుల పండుగ అని కూడా అంటారు. తెల్ల వారుఝామునే ఊరి మధ్యలో ఉన్న సత్యమ్మ దేవత దగ్గర పొంగళ్ళు పెట్టే వాళ్ళు. ఆ ప్రసాదం వూళ్ళొ అందరూ తప్పకుండ తినే వాళ్ళు. చాలా మంచి జరుగుతుంది అని నమ్మకం. ఆ తరువాత ఇంట్లో ఆవులను , ఎద్దులను బావి దగ్గరకు తీసుకు వెళ్ళి వాటిని కడిగి, కొమ్ములకు రంగులు వేసి, తరువాత వాటి కొమ్ములను పలకలు (అంటే చెక్కతో రకరకాల రూపాలలో చెక్కిన బొమ్మలు లాంటివి) , బెలూన్లు , రంగు కాగితాల తో అలకరించే వాళ్ళము. ఉదయం 10 కి అంతా ఊరిలో ఎడ్ల పందేలు ప్రారంభమైయేవి. ప్రతి ఒక్కరు వాళ్ళ ఎడ్లను పట్టుకొని వాటితో పాటు పరిగెత్తే వారు. మధ్యలో ఎవరైనా పట్టుకొని ఎద్దుని లొంగదీసుకొని వాటికి ఉన్న పలకలు లాకొనే వాళ్ళు. అలా ఎవరు ఎక్కువ పలకలు లాకుంటే అంత గొప్ప అన్నమాట. మేమంతా వీది అరుగుల మీద , మెద్దెల మీద నిల్చొని ఈ పోటీలు చూసే వాళ్ళము. ఇవన్నీ అయిపోగానే కుదిరితే పక్క వూళ్ళో పోటీలు కూడా చూసి వచ్చే వాళ్ళము. ఈ పోటిలు చాలా సందడిగా ఉండేవి. ఈ పోటీలు అయిపోగానే పశువులన్నిటిని మేత కోసం ఫ్రీగా అడవులలోకి వదిలేసే వాళ్ళు. మా ఇంట్లో అయితే మా బంధువులంతా కలిసే వాళ్ళము ఈ రోజు. చిన్న పిల్లలందరితో కలిపి 35-40 మంది అయ్యే వాళ్లము ఇంట్లో. అసలు అంత మంది తో ఎంత సందడి సందడి గా ఉండేదో ఇల్లు. మళ్ళి సాయంత్రం ఊరి బయట కాటారజుల దేవుళ్ళు అని కొన్ని చిన్న విగ్రహలు ఉంటాయి అక్కడ పొంగళ్ళు పెడుతారు. దాదాపు ఊరిలో జనాలంతా అక్కడా చేరే వాళ్ళు. చుట్టు పక్కల ఉన్న బీడు భుములలో ఆటలు పాటలు జరిగేవి పొగళ్ళు జరుగుతున్నంత సేపు. ఇక చివరి ఘట్టం చిట్లా కుప్ప. పొంగళ్ళు దేవుడికి నైవేద్యం పెట్టి ఓ వైపు ఎండు చెరుకు ఆకు తో పెద్ద మట వేసే వాళ్ళు. ఇక కుప్పకి ప్రతి సంవత్సరం ఎవరో ఒక పెళ్ళీడు కి వచ్చిన కుర్రాళు మంట పెట్టే వాళ్ళు. అది కూడా ఈ కుర్రాడు దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చి మంట పెడుతుంటే వేడి పొంగలి ముద్ద తో వాళ్ళ వెనుక కొట్టే వాళ్ళు. అలా చేస్తే త్వరలో ఆ కుర్రాడికి పెళ్ళి కుదురుతుందని నమ్మకం. ఇక ఆ చిట్లా కుప్ప మండుతుండగానే అడవులలోకి వదిలిన పశువులన్నిటిని తోలుకు వచ్చే వాళ్ళు. ఆ మంటతో ఆ పశువులకు దిష్టి తీసినట్టు ఉండె లా మంట పక్క నుండి వెళ్లనిచ్చే వాళ్ళు. అంతా అయిపోయినతరువాత ప్రసాదం తిని చీకటి పడుతుండగా ఇల్లు చేరే వాళ్ళము.
ఆ చివరి రోజు ఎంత సరదాగా గడచిపోయేదో. 2001 లో చివరిసారి మా వూళ్ళో సంక్రాంతి చూసా, ఆ తరువాత నుండి దాదాపు అన్ని సంక్రాంతులు మిస్ అవుతూనే ఉన్నా.. :(
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు :)

Wednesday, January 7, 2009

అ 'సత్యం' !!!


కోటి ఆశలతో కొత్త సంవత్సరం లో కి అడుగిడి వారం కూడా దాటక ముందే పెద్ద షాక్. మన ఆంధ్ర రాష్ట్రం అంతా ఎంతో గర్వం గా చెప్పుకొనే , దేశం లో అతి పెద్ద నాలుగో ఐ టి కంపెనిగా వెలుగొందుతున్న 'సత్యం' లోని నిజమైన సత్యాలు దేశ ఐటి రంగానికి పెద్ద షాక్. ఆర్థిక మాంద్యం పుణ్యమా ని ఇప్పటికే చాలా మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పరిస్థితి బాగోలేకుండా ఉంటే పులి మీద పుట్ర లా ఒక మహా పతనం సాఫ్ట్వేర్ ఉద్యోగులను మరింత భయాందోళనలలోకి నెట్టేసింది.

రాష్ట్రం లో ని ప్రతి పల్లె లోనూ సుపరిచితమైన పేరు సత్యం. వూళ్ళో నిరక్ష్యరాసులైన వాళ్ళకు కూడా కంప్యూటర్స్ అంటే 'సత్యం' గుర్తొచ్చేఅంత పేరు ప్రఖ్యాతులు ఉన్న కంపెనీ పరిస్థితి నేదు అత్యంత దయనీయం. కొన్ని సంవత్సరాల ముందు మా వూళ్ళో నేను ఇంఫోసిస్ లో పని చేస్తున్నాను అంటే అదేంటి సత్యం లో రాలేదా అనే వాళ్ళు, ఈ సారైనా సత్యం లో చేరటానికి ట్రై చెయ్యి అనే వాళ్ళు, సిఎం తో మాట్లాడి సత్యం కి ట్రై చేద్దామా అనే వాళ్ళు చాలా మంది. అంతటి ప్రఖ్యాతులు గాంచిన కంపెని. నా కెరీర్ లో మొట్టమొదటి ఇంటర్వ్యూ కూడా సత్యం తోనే ఆ రోజు అందులో చివరి రౌండ్ లో పోవటంతో చాలా బాధ పడ్డా. ఇంత మంది కోరుకోవటం వల్లేమో గత సంవత్సరమన్నర నుండి 'సత్యం' కి పని చేస్తున్నా. గత మూడు నెలల నుండి ఏదో జరగబోతుంది అన్న అనుమానాలు కానీ ఇలా జరుగుతుందని మాత్రం కలలో కూడా ఊహించలేదు.

ఎందరికో రోల్ మోడల్ లా నిలచిన 'సత్యం' రాజు వెల్లడించిన నిజాలు తీవ్ర ఉత్కంఠకి గురి చేసాయి. రాబోయే రోజులలో ఏవిధం గా ఉంటుందో తెలియదు. క్లైంట్లు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. ఇంత పెద్ద ఫ్రాడ్ జరిగినప్పుడూ ఖచ్చితం గా కొత్త ప్రాజెక్ట్లు రావటం అనేది జరగదు. ఉన్నవి అన్నా నిలుస్తాయో లేదో తెలియని పరిస్థితి. అసలే ఆర్థిక మాంద్యం , ఎంత వెతికినా కనపడని కొత్త ప్రాజెక్ట్లు దాదాపు 47 వేల మంది ఉద్యోగులను అయోమయం లోకి నెట్టేశాయి. ఒక్క రోజులోనే 1000 కోట్లు ఇన్వెస్టర్ల సొమ్ము బూడిద పాలు, దేశం లోనే అతి పెద్ద కార్పొరేట్ కుంభకోణం. ఇటువంటి కుంభకోణం లో ఒక్క రాజు తప్ప వేరెవరి పాత్రా లేదంటే నమ్మటం కష్టమే. ఆడిటర్లకి, డైరెక్టర్ల కి, బ్యాంకులకి తెలియకుండా జరగటం అసంభవం. ఈ అనుమానానికి ఊతమిచ్చే ఒక సంఘటన రెండు రోజుల ముందే జరిగింది. సత్యం కి external ఆడిటర్స్ అయిన ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ మొన్న సత్యం ఆడిటింగ్స్ నుండి తప్పుకోవటం. వీళ్ళకి ఈ ఆడిటింగ్ అవకతవకలన్ని ముందే తెలిసి ఉండవచ్చేమో అందుకే తప్పుకున్నాయి అన్న అనుమానం రాక తప్పదు. ఇక బ్యాంకులలో డబ్బు లేకుండానే ఉన్నట్లు బ్యాంకులు ఎలా చెప్ప గలిగాయి ? ఇవన్ని చూస్తుంటే నిజంగానే ఇవన్నీ ఆడిటింగ్ ఫ్రాడ్స్ ఆ లేక 7000 వేల కోట్లు దారి మాళ్ళాయా అన్న అనుమానం రాక పోదు.

ఈ దెబ్బతో ఒక సత్యం ఏ కాకుండా మేటాస్ సంస్థలు కూడా సంక్షోబంలో కి కూరుకుపోయాయి. ఒక మహా సంస్థ కళ్లముందే కుప్ప కూలింది. కూలుతూ రాష్ట్ర , దేశ కార్పొరేట్ రంగానికి మాయని మచ్చని మిగిల్చింది. ఇప్పుడు ప్రతి ఒక్క ఐ టి కంపెని బ్యాలెన్స్ షీట్లను అనుమానంగా చూడాల్సిన పర్స్థితి. ఏదొ నిజమో ఏది అబద్దమో తెలియని పరిస్థితి. ఇటువంటి విషయాలను ఆదిలోనే అరికట్టాల్సిన సెబి ఇప్పుడే నిద్ర లేచినట్టు విచారణ అంటూ హడావిడి చేయటం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందమే.
47 వేలమంది ఉద్యోగులు, వేల కోట్ల రూపాయిలు మదుపు చేసిన ఇన్వెస్టర్ల ప్రయోజనాలు ఎలా కాపాడబడుతాయో రానున్న రోజులలో కాలం నిర్ణయించాల్సిందే.