Monday, November 17, 2008

ఎవరి కోసం సినిమా టికెట్ రేట్ల పెంపు ?



నిన్న కాంగ్రెస్ నందుల ప్రదానం లో నాగార్జున సినిమా టికెట్ రేట్ల పెంచినందుకు ముఖమంత్రి కి ధన్యవాదాలు తెలిపి సినిమా ఇండస్ట్రి కి ఈ పెంపు చాలా అవసరం అని అన్నాడు. నిజానికి ఎవరికి ఉపయోగపడటానికి ఈ పెంపుదల అవసరం ? ఈ పెద్ద హీరోలకి, పెద్ద పెద్ద డైరెక్టర్ల కి కాకపోతే ? వీళ్ళేమొ కోట్లకి కోట్లు రెమ్యునరేషను తీసుకొని మూస సినిమాలు తీసి వదిలేస్తారు. ఆ సినిమా ఆడక నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు విల విలలాడిపోతారు. ప్రేక్షకుడేమో చెత్త సినిమాలు చూసే భారం కాకుండా రేట్ల పెంపుతో ఇంకో భారం మొయ్యాలి. ఈ హీరోలు రేపు, టికెట్ రేట్లు ఎలాగూ పెంచారు కదా మా రెమ్యునరేషన్ ఇంకో కోటి పెంచండి అని అడగకుండా వుంటారా ? ఇది ఇలాగే జరిగితే ప్రేక్షకులు థియేటర్ లో సినిమా చూడటం మానుకొనే రోజు త్వరలోనే వస్తుంది. ఒక విధం గా ఈ చర్య పైరసిని కూడా పెంచుతుంది. అంత డబ్బులు తగలేసి థియేటర్ లో సినిమా ఏమి చూస్తాము, పైరసీ సి డి లో చూద్దాం లే అనుకొనే వాళ్ళు పెరుగుతారు. అప్పుడూ ఇండస్ట్రి మరింత స్లంప్ లోకి వెళ్ళుతుంది.

డబ్బున్నోడిదే ఇండస్ట్రీ లో హవా అయిపోయినప్పుడు చిన్న సినిమా ఎలా బతుకుతుంది ? ఈ మధ్య వచ్చేసినిమాలలో చిన్న సినిమాలే కొద్దో గొప్పో చూడగలిగేట్టున్నాయి. అటువంటి చిన్న సినిమాని చిదిమేసే ఈ ప్రయత్నాలు ఇండస్ట్రీకి ఏ మాత్రం దోహదపదవు. చిన్న సినిమా ని బతికించాలని ఉత్తుత్తి కబుర్లు చెప్పే దాసరే వీటికి ఆద్యుడు. తన సిరి మీడియా ద్వారా డిస్టిబ్యూట్ చేసే సినిమాల కోసం అప్పట్లో పెద్ద సినిమాలకు మొదటి రెండు వారాలలో టికెట్ రేట్ పెంచుకోవటానికి ప్రభుత్వం తరపున కృషి చేసి ఇండస్ట్రి పతనానికి నాంది పలికాడు. అప్పట్లో చిరు, నాగార్జున, అల్లు అరవింద్, అశ్వినీదత్ లాంటి పెద్ద హీరోలు, నిర్మాతలూ వంత పాడి ఈ రోజు సినిమా ఇండస్ట్రీ మేలు కోరుతున్నామని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు.

నిజం గా వీళ్ళకి ఇండస్ట్రీ మీద ప్రేమ వుంటే ఈ హీరోల రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి. ఒక్కో సినిమా కి 20 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం వుందా ? తెలుగు సినిమా సత్తా పెరిగింది నిజమే అయి వుండవచ్చు, కానీ ఆ రేంజ్ ని అడ్డం పెట్టుకొని అనవసరమైన పోటి తో సినిమా బడ్జెట్ ని ఆసాంతం పెంచి ఇండస్ట్రిని నాశనం చేస్తున్నారు. 25 కోట్ల బడ్జెట్ సినిమా లో హీరోకి 7 కోట్లు , హీరోఇన్ కీ దాదాపు కోటి , డైరెక్టర్ కి ఓ 3 కోట్లు ,ఇలా రెమ్యునరేషన్ కే 70 శాతం ఖర్చు పెడితే సినిమా లో క్వాలిటి ఎలా వస్తుంది ? 25 కోట్లు సినిమా కి పెడితేకనీసం 30 కోట్ల కలెక్షన్ దాటితే తప్ప అందరూ లాభాలతో గట్టెక్కరు. అసలు నిజాయతి గా ప్రశ్నించుకుంటే మన తెలుగు సినిమా రేంజ్ కి 30 కోట్ల పైచిలుకు సంపాదించే సత్తావుందా ? 30 కోట్ల పైన సంపాదించిన సినిమాలు వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. ఇలా డబ్బులు వెనకేసుకున్న వాళ్ళే మళ్ళీ ఇలెక్కి అరవటం సినిమా ఇండస్ట్రి స్లంప్ లో కి వెళ్ళిపోతుంది అని. నిర్మాతైనా, హీరో అయినా బడ్జెట్ కంట్రోల్ చేసుకోవటం ఒక్కటే చాలా ముఖ్యం తెలుగు సిని పరిశ్రమ గట్టెక్కాలంటే. హీరోలు నిర్మాతలు ఇప్పటికైనా మారండి. మీ అసలైన సత్తా ఎంతో తెలుసుకొని అందుకు తగ్గటే బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. తెలుగు సినిమా ని పచ్చగా పది కాలాలు బతకనీయండి.

6 comments:

మధు said...

>>తెలుగు సినిమా సత్తా పెరిగింది నిజమే అయి వుండవచ్చు

సత్తా పెరగలేదు, అష్టవంకర హీరోలతోనూ, అరువు అర్ధణా హీరోవిన్లతోనూ పడలేక సత్తువలేక దేకుతూ ఉంది.

బాగా వ్రాసారు.

కొత్త పాళీ said...

ఏంటి మేష్టారూ మీరు మరీనూ. తెలుగు సినిమాని సినిమాలాగే చూడాలి. సినిమా వాళ్ళని సినిమా వాళ్ళలాగే ్చూడాలి. ఎక్కడన్నా మామూలు మనుషుల్లాగా చూస్తారా ఏంటి?:)

లక్ష్మి said...

కొత్తపాళీ గారి కామెంటు కేక

Kathi Mahesh Kumar said...

శ్లాబ్ విధానం వలన ధియేటర్ అద్దెలు పెరిగేసరికీ, పెద్ద సినిమాలు తప్ప చిన్న సినిమాలకు రిలీజుకూడా దొరకడం గగనమయ్యింది.అంటే పరిశ్రమలో పెద్ద సినిమాల ఆధిపత్యం తొంభయ్యవ దశకంలోనే మొదలైనట్టు లెఖ్ఖ. ఇప్పటికి పరిస్థితి ప్రమాదకర స్థాయికి చేరింది అంతే!

కాకపోతే, ఈ తరుణంలో కొందరు నిర్మాతలు (డి.సురేష్ -సురేష్ ప్రొడక్షన్స్) డిస్ట్రిబ్యూటర్లుగా ,ఎగ్సిబిటర్లుగా కూడా మారిపోయి. కొందరు డిస్ట్రిబ్యూటర్లు(ఉదా:‘దిల్’ రాజు-వెంకటేశ్వరా మూవీస్) నిర్మాతలూ ఎగ్జిబిటర్లుగా అవతారమెత్తి. పరిశ్రమను తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకుంటున్నారు. వీరి పేరులేనిదే సినిమా రిలీజ్ కూడా కాని పరిస్థితి త్వరలో నెలకోనుంది (ఆల్రెడీ ఆ లక్షణాలు కనబడుతున్నాయి).రామోజీరావు ఈ ట్రెండుకు ఆద్యుడేఅయినా, పాపం సుమన్ దెబ్బకి ప్లానంతా మంటగలిసింది. దాంతోపాటూ వరుస చెత్తసినిమాలతో ఉషాకిరణ్/మయూరి సంస్థలు మూలబడ్డాయి.

అంటే,కొందరు వ్యక్తులు/సంస్థల చేతుల్లో నిర్మాణం నుంచీ ధియేటర్లోని బాక్సాఫీస్(టికెట్ కౌంటర్)వరకూ ఆధిపత్యం చలాయించబడుతుంది. అలాంటప్పుడు చిన్నసినిమా,చిన్ననిర్మాతా బతికేదెక్కడ? వీరిదయాదాక్షిణ్యాలు లేనిదే పరిశ్రమేతరులు సినిమా తీసేదెలా? మంచి సినిమా వచ్చేదెక్కడ?

ఈ ఇద్దరు నిర్మాతలూ ఒకవైపైతే, మరోవైపు రాఘవేంద్రరావు-అల్లుఅర్వింద్-అశ్వినీదత్ లు తమతమ గుడారాల్లో సేఫ్టీనెట్ వెదుకుతున్నారు. వీళ్ళూ ధియేటర్ల నిర్మాణంలోకి అడుగుపెట్టి తమ కోటల్ని సురక్షితం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.

ఇలా ప్రతిక్యాంపూ పెద్ద(డబ్బులొచ్చే)సినిమాకు పట్టంగడుతుంటే, ప్రేక్షకులనుంచీ డబ్బుగుంజే పధకాలేస్తారేతప్ప నికాస్సైన వినోదాన్ని అందించే సినిమా తీస్తారా?

మనకెలాగూ ప్రతివారం సినిమాచూసే రోగం అంటుకుంది. we are addicted to cinema and it is very essential part of life. మన అలవాటునివాళ్ళు నిస్సిగ్గుగా క్యాష్ చేసుకుంటున్నారు. తప్పువాళ్ళదా, మనదా లేక పరిశ్రమలో నెలకొన్న వ్యవస్థదా అంటే అందరిదీ అనే చెప్పుకోవాలి. సమాధానం ‘నవతరంగం’లో వెదకాలి.

చైసా said...

ఏముంది ...
మన జేబులు నిల్
వాళ్ళ జేబులు ఫుల్

Niranjan Pulipati said...

@ మధు గారు : ఇక్కడ నా వుద్దేశం సినిమా రేంజ్ పెరిగింది అని, సత్తా అని తప్పుగా వాడాను. రేంజ్ అంటే వైడ్ రీచ్ అంతె..

@ కొత్తపాళి గారు , లక్షి గారు : నిజమే అనుకోండి, కానీ ఎదో ఆశ, వీళ్ళు మారితే కొన్ని మంచి సినిమాలు వస్తాయేమో అని.

@ మహేష్ - బాగా చెప్పావు.

@ చైసా గారు - అదే కదా.. నాగార్జున అయితే సిగ్గు లేకుండా డైరెక్ట్ గా చెప్పాడు, " ఇది మీకు కష్టమేమో కాని, మాకు చాలా ఇష్టం అని "