Monday, July 22, 2024

గ్రహాలా .. మజాకా..

 తిరుపతి గ్రూప్ థియేటర్స్ లో డిగ్రీ చదువుతున్నరోజుల్లో (1993)..  


తిరుపతి గ్రూప్ థియేటర్స్ లో డిగ్రీ చదువుతున్నరోజుల్లో (1993)... థియేటర్ లో డిగ్రీ ఏంటి అంటారా.. మరి కాలేజీ కన్నా ఎక్కువ ఉన్నది ఈ గ్రూప్ థియేటర్స్ లో నే కదా.. నవోదయా నుండి బయట వచ్చి తిరుపతి ఆర్ట్స్ కాలేజీ లో డిగ్రీ మొదటి సంవత్సరం చేరగానే ఎక్కడ లేని స్వాతంత్ర్యం వచ్చిన భావన.. వూరు దగ్గర లోనే వున్నా తిరుపతి లోనే అక్క వాళ్ళ ఇంట్లోనే ఉండి చదువుకుంటున్న రోజులు.. నవోదయ స్నేహితులు చాలమంది నాతో పాటే అదే కాలేజి లో చేరాము. వాళ్ళు అంతా హాస్టల్ లో ఒక రూం లో ఉండేవారు. ఇక నా సమయమంతా ఆ హాస్టల్ రూం లేదా సినిమా హాల్ లో నే.. నేను బిఎస్సీ ఎలక్ట్రానిక్స్ తీసుకున్నా. ఎలక్ట్రానిక్స్ నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. దానికి తోడు మా ఎలక్ట్రానిక్స్ ప్రొఫెసర్ చాలా స్ట్రిక్ట్. రోజు ఆ ఒక్క క్లాస్ కి మాత్రమే వెళ్ళి మిగతా అన్నీ బంక్ కొట్టే వాళ్ళము. మాథ్స్ మరియు ఫిజిక్స్ కి ఉదయం సాయంత్రం ట్యూషను.. 

ఓ నూటాపాతిక సినిమాలు చూసేసరికి మొదటి సంవత్సరం పరీక్షలు దగ్గరికి వచ్చేసాయి.. ఒక వారం ముందు చదివితే అన్నీ పాస్ అయిపోతాము అన్న అతి విశ్వాసం బాగా నే ఉండేది... పరీక్షల కు నెల ముందు ఉగాది పండుగ. పండగ కి వూరు వెళ్ళాను. అంతకు ముందు ఎప్పుడు రాశి ఫలాలు చూసి / చదివింది లేదు.. మొదటి సారి పండుగ రోజు అమ్మ పంచాంగం చూపించింది. అంతా గుర్తు లేదు కాని ఒకే ఒక వాక్యం మాత్రం ఈ రోజు కి మరచిపోలేదు.. " విద్యార్థులు  మళ్ళీ మళ్ళీ పరీక్ష ఫీజులు కట్టాల్సి రావచ్చు .. " అమ్మ అది చూపించి జాగ్రత్త, ఎలాగైనా పాస్ అవ్వాలి అని చెప్పింది. రాశి ఫలాల మీద ఇంట్లో వాళ్ళకి నమ్మకం బాగ ఎక్కువ. కాబట్టి పరీక్షలలో తప్పుతాను అని దాదాపు గా ఫిక్స్ అయిపోయారు. అప్పటికే నా గ్రూప్ థియేటర్స్ అడ్వెంచర్స్  చూచాయి గా తెలిసి ఉండటం తో జాగ్రత్తలు కాస్తా ఎక్కువే చెప్పారు.  

ఇక పండుగ ముగించుకొని మళ్ళి తిరుపతి చేరాను. మొదటి సారి నాకు కూడా కాస్తా పరీక్షల భయం ప్రారంభం అయ్యింది  (రాశి ఫలాలు చదవటం వల్ల కాదు కాని ఎందుకో మరి..). సరే అని తదుపరి రోజు హాస్టల్ , సినిమా వైపు వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని ఒక్కో సబ్జెక్ట్ పరిస్థితి చూసాను.


మొదటిది మాథ్స్ - ట్యూషన్ మాస్టర్ అప్పట్లో తిరుపతి లో చాలా ఫేమస్. నేను ట్యూషన్ ఏరోజూ మిస్ అవను. అదీ కాకుండా ఇందులో 100 కి 100 వస్తాయి అని గట్టి నమ్మకం. 

రెండోది ఫిజిక్స్ - ఈ ట్యూషన్ మాస్టర్ కూడా గట్టి వారే. ఇది కూడా ఏరోజూ మిస్ అవలేదు. సో ఇదీ సమస్య కాదు.. 

మూడోది ఎలక్ట్రానిక్స్ - నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. అప్పటి వరకు కాలేజి హిస్టరి లో ఎలక్ట్రానిక్స్ మొదటి సంవత్సరం లో 68  మార్కులు అత్యధికం.. కానీ నా వరకు 90 దాటుతాయి అని చాలా గట్టి నమ్మకం.

నాలుగోది ఇంగ్లీష్ - పెద్దగా మార్కులు రావు కాని 50 దాటుతాయి అనిపించింది.

చిట్ట చివరిది హింది - పుస్తకం తెరువగానే అప్పుడు మొదలైంది నిజమైన భయం. ముక్క వస్తే ఒట్టు. అసలు రెండో భాష తెలుగు కాకుండా హిందీ ఎందుకు తీసుకున్నానో ఇప్పటికీ పెద్ద మిస్టరీ.. నవోదయా లో +1, +2 లో హిందీ కి భయపడి  MBiPC  తీసుకున్నాను. తెలుగు లో ఎప్పుడూ టాప్ మార్కులే వచ్చేవి.. అలాంటి తెలుగు వదిలి హిందీ తీసుకొనేలా చేసిన రాంబాబు మీద పీకల దాకా కోపం వచ్చింది. ఇక రాశిఫలాలు నిజం అవుతాయి అని భయం ప్రారంభం అయింది. 

తరువాతి  రెండు రోజులు హిందీ పుస్తకం బూజు మరింత దులపటం వల్లా కాస్తా భయం తగ్గింది. 

తరువాతి రెండు వారాలు మళ్ళీ క్లాసులు గ్రూప్ ధియేటర్స్ లోనే.. ఇక చివరి వారం కాలేజి, ఆ తరువాత ఇక పరీక్షలే.. పరీక్షల షెడ్యూల్ వస్తుంది అని కాలేజీ కి వెళ్ళాను. ఆ రోజు షెడ్యూల్ తీసుకొని సాయంతం వూరు వెళ్ళిపోవాలి అని ప్లాను. ఇక వూరులోనే  ఉండి చదువుకుంటు పరీక్ష రోజు తిరుపతి వెళ్ళి రాసి వూరికి వచ్చేసే ప్లాను. 

కాలేజి లోకి వెళ్ళబోతుంటే ,అప్పుడే కాలేజీ నుండి బయటకి వస్తున్నాడు గణ..నన్ను చూడగానే దా వెళ్ళి క్రికెట్ (నిజ్జం కార్డ్స్ కాదు) ఆడుదాం అన్నాడు. వెళ్ళి పరీక్షల షెడ్యూల్ రాసుకొస్తా అని చెప్పా. 

నేను రాసుకొచ్చా అని చెప్పాడు. సరే అని టీ స్టాల్ దగ్గర్ కూర్చొని టీ తాగుతూ షెడ్యూల్ నోట్ చేసుకున్నా. గణపతి ది కంప్యూటర్స్. సో నా ఎలక్ట్రానిక్స్ , తన కంప్యూటర్స్ తప్ప మిగతా అన్ని సేం సబ్జెక్ట్స్. లాస్ట్ పరీక్ష ఎలక్ట్రానిక్స్. 

ఆరోజు సాయంత్రం వూరు వెళ్ళిపోయాను. వారం తరువాత పరీక్షలు స్టార్ట్ అయ్యాయి. రోజు ఉదయం తిరుపతి వెళ్ళటం పరీక్ష అవగానే వూరు వెళ్ళిపోవటం. ప్రతి పరీక్ష కి మధ్య ఒక రోజు గాప్ ఉండేది. రోజూ రాశిఫలాలు గుర్థు వస్తూ ఉండేవి. ఒక్కో పరీక్ష అవగానే కాస్తా ధైర్యం పెరగసాగింది.  మరీ హిందీ అయిపోగానే ఇక పూర్తి నమ్మకం వచ్చేసింది , రాశి ఫలాలు ఫలించవు అని. 

ఫిజిక్స్ పరీక్ష అయ్యాక ఇక చివరి పరీక్ష ఎలక్ట్రానిక్స్ దీనికి రెండు రోజుల గాప్. ఫిజిక్స్ పరీక్ష అయిపోయిన రోజు  రాత్రి సడన్ గా విపరీతమైన జ్వరం. ఒక్క సారి రాశి ఫలాలలో వ్యాక్యం మళ్ళీ గుర్తు వచ్చింది. " విద్యార్థులు  మళ్ళీ మళ్ళీ పరీక్ష ఫీజులు కట్టాల్సి రావచ్చు .. " అంటే పరీక్ష తప్పటమే కాదు, మిస్ అయినా కూడా ఫీజులు మళ్ళీ కట్టాలి అని అర్థం అవగానే గ్రహాలూ మరీ ఇంత పగపట్టేసాయా అని భయం వేసింది. ఎలక్ట్రానిక్స్ కి ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు సో బాగా రెస్ట్ తీసుకొని ఎలాగైనా వెళ్ళి పరీక్ష రాసి , రాశి ఫలాలు తప్పు అని నిరూపించాలని ఫిక్స్ అయిపోయా. ఎలాగైతే నే పరీక్ష ముందు రోజు రాత్రికి జ్వరం బాగా తగ్గిపోయింది. 

సంతోషం గా తరువాతి రోజు ఉదయం టైం కి కాలేజి కి చేరా. కాలేజి అంతా నిర్మానుష్యం .. ఏదో అనుమానం..  చివరి పరీక్ష , అదీ ఎలక్ట్రానిక్స్ లో తక్కువ స్టూడెంట్స్ కదా అని సర్ధి చెప్పుకొని హాలు లోపలకి వెళ్ళా.. ఒక్కరు కూడా లేరు. టైం చూసుకున్నా తొందరగా వచ్చానేమో అని. కరెక్ట్ టైం ఏ. సరే లే అని ఒక పది నిమిషాలు వైట్ చేసా . వుహూ.. ఒక్కరూ రారే.. 

ఏమి జరుగుతుందో అర్థం కాక హాస్టల్ కి వెళ్ళా.. మొదటి రూం లో ఎలక్ట్రానిక్స్ ఫ్రెండ్స్ ఉంటారు  ఆ రూం కి వెళ్ళా. నన్ను చూడగానే ఏంటి నిన్న ఎక్జాం కి రాలేదు అన్నారు. ఆ షాక్ నుండి తేరుకోటానికి 10 నిమిషాలు పట్టింది..  

అదేంటి ఈ రోజు కదా పరీక్ష , నిన్న కంప్యూటర్స్, ఈ రోజు ఎలక్ట్రానిక్స్ కదా అని అడిగా.

ఎవరు చెప్పారు ? ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ , కెమిస్ట్రీ మూడూ ఒకే రోజు అని అన్నారు. 

తప్పు ఎక్కడ జరిగిందో అర్థం కాలేదు. 

ఆలోచించగా పరీక్షల షెడ్యూల్ రాసుకున్న రోజు గుర్తు వచ్చింది. గణపతి అన్నీ కరెక్ట్ గానే చెప్పాడు కాని లాస్ట్ పరీక్ష (కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్) రెండూ ఒకే రోజు అనే చోట తప్పులో కాలేసాడు. రెండూ ఒకే రోజు ఉండవు అనుకొని ఎలక్ట్రానిక్స్ ఆ తరువాతి రోజు అని చెప్పాడు. నేనూ పెద్దగా ఆలోచించకుండా అదే రాసుకున్నా. అలా గ్రహాలు ఎప్పుడో జాతకం రాసేసాయి.. ఆ తరువాత మనం ఎంత ట్రై చేసినా ఏం లాభం.. 


ఆ విధంగా నేను పరీక్ష ఫీజు సెప్టంబర్ లో మళ్ళీ కట్టాల్సి వచ్చింది.. గ్రహాలా మజాకా..