Tuesday, April 1, 2008

గుర్తుకొస్తున్నాయి -- 'అంతం'

నేను 7 వ తరగతి నుండి నవోదయా స్కూల్ లో చదివాను. చిత్తూర్ జిల్లా లో మేము చదివేటప్పుడూ స్కూల్ హార్సిలీ హిల్స్ లో ఉండేది. అక్కడ స్కూల్ తప్ప వేరే ఎంటర్తైన్మెంట్ ఉండేది కాదు. కొండ పైకి బసు రోజు కి 3 సార్లు మాత్రమే వచ్చేది. అది కాక వేరే బస్ అంటే 10 కిలో మీటర్లు కొండ దిగితే అక్కడ నుండి మదనపల్లి కి బస్సులు ఉండేవి. సినిమాలు చూడగలిగే దగ్గర ప్లేసు అంటె మదనపల్లే. నేను 9 వ తరగతి చదివేటప్పుడు రాజావిక్రమార్కా సినిమా రిలీజ్ అయ్యింది. మా క్లాస్ లో ప్రదీప్ అని ఒక్క చిరు వీరాభిమాని. సినిమాల పిచ్చి బాగా ఉన్నవాడు ఉండేవాడు. అక్కడ స్కూల్ లో చదవటం అంటె జైలు లో ఉన్నట్లే. కేవలం ఆదివారం మాత్రం పేరెంట్స్ ని కలుసుకొనే అవకాశం. సండే కూడా రోజూ ఈవెనింగు రోల్ కాల్ ఉండేది. ఇలాంటి పరిస్థితి లో ప్రదీప్ కి ఎలగైనా రాజా విక్రమార్క చూడాలనిపించింది. సో తను , ఇంకో ఫ్రెండు ఓం ప్రకాష్ ఇద్దరూ కలసి ప్లాన్ చేసారు. ఆదివారం వుదయం 6 కంతా లేచి ఎవరి కంటా పడకుండా కొండ పైన నుండి బయలు దేరారు నడచి. దిగేటప్పుడు అడ్డ దారులన్నీ పట్టి 10 కిలో మీటర్లు దిగి అక్కడ నుండి బసు పట్టుకొని మదనపల్లి చేరారు. చేరి రాజా విక్రమార్కా చూసారు. చూసి తిన్నగా బయలు దేరి పైకి రావచ్చు కదా. ఎలాగూ ఇంత కష్ట పడి మదనపల్లి వరకు వచ్చాము కదా అని ఇంకో సినిమా ఉంటే దానికి చెక్కేసారు. సాయంత్రం అయ్యింది. రోల్ కాల్ లో వాళ్ళు మిస్సింగు. మేము ఎవ్వరమూ నిజం చెప్పలేదు. మా టీచర్లూ రోజంతా చూసారు. పాపం వాళ్ళు బాగా కంగారు పడ్డారు. మాకూ వాళ్ళూ ఏమైయ్యారో అని భయపడ్డాము. ఇక్కడా మేమంతా ఇలా కంగారు పడుతుంటే వాళ్ళూ ఇద్దరూ తరువాతి రోజు వుందయం నవ్వులు చిందిస్తూ బసు దిగారు. అప్పటికే మా టీచర్ల కీ వాళ్ళూ సినిమాకి వెళ్ళీన విషయం చెప్పేసారు కొందరు సిన్సియర్ స్టూడెంట్సు. ఇక ఆ రోజు మొత్తం వాళ్ళకు పనిష్మెంట్లే. వాళ్ళు పనిష్మెంట్ అనుభవిస్తూ కూడా మేము అలా వచ్చి వెళ్ళుతుంటే సినిమా భలే ఉంది అని నవ్వుతూ చెప్ప సాగారు. వాళ్ళు మొత్తానికి మా అందరికీ సినిమాలు చూసే ఒక దారి చూపించారు. విమానం కనిపెట్టిన రైట్ సోదరుల లాగా, వీళ్ళు రూట్ సోదరులన్నమాట (మా అందరికీ రూట్ చూపించారు కదా ) కొన్ని రోజుల తరువాత ఒక్క సండే ఆపద్భాంధవుడు కి నేనూ వెళ్ళాను అలా 10 కిలోమీటర్లు నడచి. కానీ నేను చూసి సాయంత్రం కల్లా వెన్నక్కి వచ్చేసా. అంత కష్టపడి నేను వెనక్కు వచ్చేసినా ఆ రోజు రోల్ కాల్ జరగలేదు. అలా జనాలు అంతా ఆదివారం రావటం సినిమాలకి వెళ్ళి రావటం సాధారణమైపోయింది. ప్రతి ఆరంభానికీ ఒక అంతం వుంటుంది కదా. అలాంటి అంతం నాగార్జునా సినిమా 'అంతం' రూపము లో వచ్చింది. అంతం సినిమా రిలీజ్ అవ్వగానే ఆ సినిమా కి ఇదేవిధం గా వెళ్ళారు మా ఫ్రెండ్స్ గ్యాంగు. వాళ్లలో ఒక్కతను అప్పటి మినిష్టరు కొడుకన్నమాట. వాళ్ళ దురదృష్టం కొద్ది ఆ రోజు మా ఫ్రెండు వాళ్ళ నాన్న గారు మా ఫ్రెండు కోసమని వచ్చారు. వచ్చి తన కోసం అడిగేసరికి మా టీచర్లంతా బాగా హైరానా పడిపోయారు. నాకు విషయం తెలిసినా చెప్పలేదు. ఇక స్కూల్ జీప్ తీసుకొని వెతకటానికి బయలుదేరారు ప్రిన్సిపాల్ తో సహా. చివరికి సినిమా చూసి రెటర్న్ వచ్చేటప్పుడు దారి లో దొరికిపోయారు 'అంతం' గ్యాంగు. ఈ దెబ్బతో ఆదివారాలు మమ్ములని బాగా కట్టడి చేసారు, సినిమాల సందడీ తగ్గిపోయింది. అలా 'అంతం' సినిమా మా సినిమా పిచ్చి అంతం చూసిందన్నమాట.