Wednesday, December 31, 2008

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2009


మిత్రులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

Monday, November 17, 2008

ఎవరి కోసం సినిమా టికెట్ రేట్ల పెంపు ?



నిన్న కాంగ్రెస్ నందుల ప్రదానం లో నాగార్జున సినిమా టికెట్ రేట్ల పెంచినందుకు ముఖమంత్రి కి ధన్యవాదాలు తెలిపి సినిమా ఇండస్ట్రి కి ఈ పెంపు చాలా అవసరం అని అన్నాడు. నిజానికి ఎవరికి ఉపయోగపడటానికి ఈ పెంపుదల అవసరం ? ఈ పెద్ద హీరోలకి, పెద్ద పెద్ద డైరెక్టర్ల కి కాకపోతే ? వీళ్ళేమొ కోట్లకి కోట్లు రెమ్యునరేషను తీసుకొని మూస సినిమాలు తీసి వదిలేస్తారు. ఆ సినిమా ఆడక నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు విల విలలాడిపోతారు. ప్రేక్షకుడేమో చెత్త సినిమాలు చూసే భారం కాకుండా రేట్ల పెంపుతో ఇంకో భారం మొయ్యాలి. ఈ హీరోలు రేపు, టికెట్ రేట్లు ఎలాగూ పెంచారు కదా మా రెమ్యునరేషన్ ఇంకో కోటి పెంచండి అని అడగకుండా వుంటారా ? ఇది ఇలాగే జరిగితే ప్రేక్షకులు థియేటర్ లో సినిమా చూడటం మానుకొనే రోజు త్వరలోనే వస్తుంది. ఒక విధం గా ఈ చర్య పైరసిని కూడా పెంచుతుంది. అంత డబ్బులు తగలేసి థియేటర్ లో సినిమా ఏమి చూస్తాము, పైరసీ సి డి లో చూద్దాం లే అనుకొనే వాళ్ళు పెరుగుతారు. అప్పుడూ ఇండస్ట్రి మరింత స్లంప్ లోకి వెళ్ళుతుంది.

డబ్బున్నోడిదే ఇండస్ట్రీ లో హవా అయిపోయినప్పుడు చిన్న సినిమా ఎలా బతుకుతుంది ? ఈ మధ్య వచ్చేసినిమాలలో చిన్న సినిమాలే కొద్దో గొప్పో చూడగలిగేట్టున్నాయి. అటువంటి చిన్న సినిమాని చిదిమేసే ఈ ప్రయత్నాలు ఇండస్ట్రీకి ఏ మాత్రం దోహదపదవు. చిన్న సినిమా ని బతికించాలని ఉత్తుత్తి కబుర్లు చెప్పే దాసరే వీటికి ఆద్యుడు. తన సిరి మీడియా ద్వారా డిస్టిబ్యూట్ చేసే సినిమాల కోసం అప్పట్లో పెద్ద సినిమాలకు మొదటి రెండు వారాలలో టికెట్ రేట్ పెంచుకోవటానికి ప్రభుత్వం తరపున కృషి చేసి ఇండస్ట్రి పతనానికి నాంది పలికాడు. అప్పట్లో చిరు, నాగార్జున, అల్లు అరవింద్, అశ్వినీదత్ లాంటి పెద్ద హీరోలు, నిర్మాతలూ వంత పాడి ఈ రోజు సినిమా ఇండస్ట్రీ మేలు కోరుతున్నామని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు.

నిజం గా వీళ్ళకి ఇండస్ట్రీ మీద ప్రేమ వుంటే ఈ హీరోల రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి. ఒక్కో సినిమా కి 20 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం వుందా ? తెలుగు సినిమా సత్తా పెరిగింది నిజమే అయి వుండవచ్చు, కానీ ఆ రేంజ్ ని అడ్డం పెట్టుకొని అనవసరమైన పోటి తో సినిమా బడ్జెట్ ని ఆసాంతం పెంచి ఇండస్ట్రిని నాశనం చేస్తున్నారు. 25 కోట్ల బడ్జెట్ సినిమా లో హీరోకి 7 కోట్లు , హీరోఇన్ కీ దాదాపు కోటి , డైరెక్టర్ కి ఓ 3 కోట్లు ,ఇలా రెమ్యునరేషన్ కే 70 శాతం ఖర్చు పెడితే సినిమా లో క్వాలిటి ఎలా వస్తుంది ? 25 కోట్లు సినిమా కి పెడితేకనీసం 30 కోట్ల కలెక్షన్ దాటితే తప్ప అందరూ లాభాలతో గట్టెక్కరు. అసలు నిజాయతి గా ప్రశ్నించుకుంటే మన తెలుగు సినిమా రేంజ్ కి 30 కోట్ల పైచిలుకు సంపాదించే సత్తావుందా ? 30 కోట్ల పైన సంపాదించిన సినిమాలు వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. ఇలా డబ్బులు వెనకేసుకున్న వాళ్ళే మళ్ళీ ఇలెక్కి అరవటం సినిమా ఇండస్ట్రి స్లంప్ లో కి వెళ్ళిపోతుంది అని. నిర్మాతైనా, హీరో అయినా బడ్జెట్ కంట్రోల్ చేసుకోవటం ఒక్కటే చాలా ముఖ్యం తెలుగు సిని పరిశ్రమ గట్టెక్కాలంటే. హీరోలు నిర్మాతలు ఇప్పటికైనా మారండి. మీ అసలైన సత్తా ఎంతో తెలుసుకొని అందుకు తగ్గటే బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. తెలుగు సినిమా ని పచ్చగా పది కాలాలు బతకనీయండి.

Wednesday, October 22, 2008

చాలా రోజుల తరువాత..

బ్లాగుల వైపు చూసి చాలా రోజులైంది. ఇండియా ట్రిప్పు ప్రిపరేషన్లు, ఆ తరువాత నెల రోజుల వెకేషను, అన్నీ పూర్తి చేసుకొని రెండు వారాల క్రిందటే వచ్చాను. రాగానే క్లైంట్ బాంబులు పేల్చాడు, వెండర్స్ అందరికీ బై బై అని. సరే లెమ్మని వెళ్ళిపోదాం ఇంకో మంచి ప్రాజెక్ట్ చూసుకుందామంటే మా ఎంప్లాయర్ ఏమో బాబ్బాబు ఒక్క చాన్సు, ఇంకొక్క చాన్సు అంటూ క్లైంట్ వెంట పడటం (గోదావరి సినిమా లో చిలక జ్యోతీష్యుడు తనికెళ్ల వెనుక పడ్డట్టు ), ఆ క్లైంట్ మా వాళ్ళ గోల భరించలేక ఇంకో 3 నెలలకి ఎక్స్టెండ్ చెయ్యటం, అన్ని అయ్యి ఇప్పటికి తీరిక దొరికింది.. సో మళ్ళీ నా టపాలు మీరు భరించక తప్పదు.. :)

Tuesday, August 5, 2008

అగ్గిపెట్టుందా ?

నవోదయా లో తొమ్మిదో తరగతి చదివేటప్పుడు జీవితం తెలుగు సీరియళ్ళలాగా భారం గా సా..........గుతున్న రోజులు. త్రీ రోజెస్ యాడ్ లో లాగా మరీ రంగు రుచి, వాసనా లేని టీ లాంటి రోజులు.. అలాంటి రోజులలో బ్రహ్మి జీవితం లోకి ఇలియానా లాగా వచ్చింది science fair . ఆ సంవత్సరం గుంటుర్ జిల్లా లో మద్దిరాల నవోదయా లో జరుగుతుంది science fair . మా స్కూల్ నుండీ 15 మంది వెళ్ళవచ్చు. science fair అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక exibit తయారు చేసుకొని తీసుకు వెళ్ళాలి. ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు ( skits ) గట్రా కూడా వుంటాయి. మా స్నేహితుడి బలవంతం మీద ఏదొ ఓ సిల్లీ అయిడియా తొ ఒక exibit చేసా. ఆ exibit ని మా టీచర్లకి చూపిస్తే , 'సెలబ్రిటీ సిల్లీ ఫెలో ని చూసినట్టు ' చూసారు మా టీచర్లు. ఆ సిల్లీ చూపులను సింపుల్ గా సైడు చేసి, ఈ exibit ఏ కాకుండా నేను , నా ఫ్రెండు కలసి ఒక comedy skit వేస్తామని చెప్పి ఎలాగోలాగా వొప్పించి మొత్తానికి 15 మంది లో చోటు సంపాదించాను.

కట్ చేస్తే మరో వారం లో మదనపల్లి లో విజయవాడ బసు లో కోలాహలం గా బయలుదేరాము. (ఆటలో అరటి పండు లా ఇక చిన్న విషయం, దారిలో కడప బస్స్టాండ్ లో భోజనానికి ఆగాము. అక్కడ ఒక టి స్టాల్ పేరు, 18 సంవత్సరాలైనా నేను ఈ రోజుకి మరచి పోలేదు. దాని పేరు 'అమ్మాజాన్ బావాజాన్ హజరత్లాల్ కాకీషా మౌలానా టి స్టాళ్ అంత పెద్ద పేరు చూసి చాలా ఫన్నీ గా అనిపించింది. )
అలా తరువాతి వుదయం మద్దిరాల చేరాము. మద్దిరాల, చిలకలూరి పేట నుండీ కోటప్ప కొండకి వెళే దారిలో వుంటుంది. అక్కడ నవోదయా స్కూల్ దాదాపు నిర్మానుష్యమైన ప్రదేశం లో వుంటుంది. అటొ కిలోమీటరు, ఇటో కిలోమీటరు ఒక్క ఇల్లు కూడా వుండదు. మాకు వసతి స్కూల్ నుండి ఒక కిలోమీటరు తరువాత కొత్తగా కడుతున్న హాస్టల్ లో ఇచ్చారు. రోజూ ఒక స్కూల్ బసు వచ్చి ఉదయం మమ్ములని హాస్టల్ నుండీ పికప్ చేసుకుని వెళ్తుంది. సాయంత్రం భోజనాలు కూడా స్కూల్ లోనే అందరికీ. ఆ తరువాత బస్ లో మమ్ములని హాస్టల్ దగ్గర డ్రాప్ చేసే వాళ్ళు.

మొదటి మూడు రోజులు సాఫీ గానే గడచిపోయాయి. స్టాల్స్ లో మా exibits తో ఉదయం నుండీ సాయంత్రం 4 వరకు కూర్చొని, 4 నుండి 9 వరకు సాంస్కృతిక కార్యక్రమాల పోటీలలో పాల్గొనే వాళ్ళము. మా స్కూల్ ఆటల పోటీలు మూడో రోజే పూర్తైపోయాయి. సో నాలుగో రోజు సాయంత్రం 7 గంటలకే భోజనం చేసి హాస్టల్ కి నడచి వెళ్దామని ప్లాన్ చేసాము ఒక ఐదుగురు స్నేహితులుము.

శితాకాలపు చలి ప్రతాపం చూపించటం అప్పుడప్పుడే మొదలౌతుంది. రోడంతా చాలా నిర్మానుష్యం గా వుంది. అప్పుడప్పుడు వెళ్ళే ఒకటి అరా బసుల వెలుగు తప్పా అంతా చీకటే. అలాంటి పరిస్థితులలో మేము ఐదుగురం అలా నడచి వెళ్తూ వున్నము. ఇంతలో ఎదురుగ రోడ్డు మధ్యలో ముగ్గురు కూర్చొని వున్నారు. మమ్ములని చూడగానే వాళ్ళు మెల్లగా మా వైపు రావటం మొదలు పెట్టారు. కాస్త దగ్గరగా రాగానె వాళ్ళను చూస్తే అప్పుడే కాలేజీకి స్టూడెంట్స్ లాగా వున్నారు. వాళ్ళు వచ్చి మాకు అడ్డంగా నిలబడ్డారు. చూడగానే వాళ్ళు బాగా తాగి వున్నరని అర్థం అయ్యింది. చుట్టూ చీకటి, నిర్మానుషయమైన ప్రదేశం. అట్టి విపత్కర పరిస్థితులలో కూడా మాకు అస్సలు భయం వెయ్యలేదు (నిజమని నమ్మేశారా ఖామెడీగా.. ? ) .

ఇంతలో వాళ్ళల్లో ఒక్కడు నోటిలో సిగరేట్ పెట్టుకొని ఫైట్ మాస్టర్ రాజు లాగా వికృతంగా ముఖం పెట్టి 'అగ్గిపెట్టుందా ' ? అని అడిగాడు.
పాపం ఆ అడిగినవాడూ చాలా సీరియస్సుగానే అడిగాడు, కానీ మా ఫ్రెండు ఒక్కడికి అగ్నిపర్వతం లో క్రిష్ట్ణ దైలాగ్ గుర్తొచ్చినట్టుంది .. సో ఇదేదో కామెడీ వ్యవహారం అనుకున్నాడో లేక, మావాడి మనోభావాలు తీవ్రం గా దెబ్బతిన్నాయో (స్కూల్ పిల్లాడిని పట్టుకొని అగ్గిపెట్టుందా అంటే దెబ్బ తినవూ మరి.. ) తెలియదు కానీ మావాడూ క్రిష్ట్ణ స్తైల్లో ' మేము బీడీలూ సిగరెట్లూ తాగేవాళ్లలా కనిపిస్తున్నామా మీ కళ్ళకి ' అని కొంచెం వంకరగా అడిగాడు. మావాడి డైలాగ్ పూర్తికాకుండానే 'అగ్గిపెట్టుందా ' అని అడిగినవాడు జేబులోనుండి అగ్గిపెట్టె తీసి పుల్ల గీసాడు.

ఒక్కసారిగా నా కళ్ళముందు బుల్లి ఫ్లాష్ బ్యాకు.. అందులో అంతకు ముందు వేసవి సెలవులలో చూసిన 'ఎర్రమందారం ' సినిమా గుర్తు వచ్చింది. అందులో రాజేంద్రప్రసాద్ రాత్రి పూట వొంటరిగా రోడ్డు మీద నడచి వస్తుంటే విలన్ గ్యాంగ్ కూడా అచ్చు ఇలాగే 'అగ్గిపెట్టుందా ? ' అని అడగటం, సమాధానం చెప్పేలోపు పుల్ల వెలించటం ఆ తరువాత రాజేంద్రప్రసాద్ ని చంపేయటం అన్నీ ఫ్లాషు లాగా వెలిగాయి. క్షణాలలో మాకు సీను మొత్తం అర్థమైపోయింది. 'తిరిగేదే భూమి, కాలేదే నిప్పు , పోరాడే వాడే మనిషి, పాకేదే పాము, ఈదేదే చేప ' లాంటి జీవిత సత్యాలు చెప్పే పవన్ కళ్యాన్ సినిమాలు అప్పటికి లేవు కదా.. సో పోరాడటం పక్కనెట్టి, పరిగెట్టటం ప్రారంభించాము వాళ్లను ఒక తోపు తోసి. మావాడి వంకర డైలాగ్ విన్న వాళ్ళకి ఎక్కడో కాలటం తో వాళ్ళూ మా వెంట పడ్డారు. హార్స్లీహిల్స్ లో రోజూ వుదయం 5.00 కి చలిలో పరుగెత్తే సన్నివేశాలని గుర్తు తెచ్చుకొని స్పీడుగానే పరుగెత్తుతున్నాము. మాలో ఒక్కతను బాగా స్లో. ఇక కొన్ని క్షణాలలో మావాడు వాళ్ళకు దొరికిపోతాడనగా ఎదురుగా ద్రౌపతీ వస్త్రాపహరణం సీన్లో క్రిష్ట్ణుడు ప్రత్యక్షమైనట్టు ఒక్క ఎర్రబస్సు ఆ రోడ్డులో ప్రత్యక్షమైంది. ఆ బస్సు లైట్ల వెలుగు పడగా మా వెంట పడ్డవాళ్ళు ఆగిపోయారు. ఇదే అదనుగా వాళ్ళ నుండి తప్పించుకొని హాస్టల్ చేరిపోయాము. అలాంటి సీరియెస్ సీన్లో కామెడి డైలాగ్ వదిలిన మావాడిపై సుత్తి వీరభద్రరావు స్టైల్లో కాసేపు తిట్ల దండకం చదివాము.

ఇప్పుడు తలచుకుంటే ఈ సీను ఎంత ఫన్నీ గా అనిపిస్తుందో.....

Monday, July 14, 2008

సిల్వర్ స్క్రీన్ సుబ్బు - సినిమా రాజకీయాలు

సిల్వర్ స్క్రీన్ సుబ్బు గత వారం గా దిగులు గా కూర్చున్నాడు. కోడి కాలు, స్కాచు చుక్కా కూడా ముట్టలేనత దిగులు లో మునిగిపోయాడు. రాష్ట్రం లో దేశం లో రాజకీయాలన్ని ఎదురు తిరిగి గిలగిలలాడుతున్న చంద్రబాబు లాగా గిలగిలలాడిపోతున్నాడు సుబ్బు.
ఈ దిగులు కి కారణం తెలుసుకోవాలంటే కొన్ని రోజులు వెన్నక్కు వెళ్ళాల్సిందే..
లాన్ లాంగ్ అగో సో లాంగ్ అగో.. ఐ డోంట్ నో హౌ లాంగ్ అగో.. ఈ సుబ్బు గారు వురఫ్ సుబ్బయ్య చిన్నప్పుడు షూల్ ఎగొట్టి మరి సినిమాలు తెగ చూసేవాడు. అమ్మా నాన్న " ఒరే సుబ్బిగా ఈ సినిమాలు మనకు కూడెడతాయా, గూడు చూపిస్తాయా .. మేమెలాగూ చదువులేక పొలం నమ్ముకొని బతుకుతున్నాము. నువ్వైనా బుద్దిగా చదువుకోరా " అని తెగ పోరే వారు.. దానికి సుబ్బిగాడు ఎంత సదూకున్నా వుద్యోగం తో సాలీ సలని బతుకులేకదే అమ్మా.. అందుకే నేను పెద్దైయ్యాక సినిమా డైరెక్టర్ అవుతా అనేవోడు. అలా నెలకు మూడు క్లాసులు వారానికి 6 సినిమాలు లాగా గడిపేసాడు.. స్కూలు నుండి కాలేజీ కి వచ్చేసరికి సుబ్బు గాడి సినిమా పిచ్చి రోజు రోజుకి పెరుగుతున్న వైయెస్ అక్రమార్జన లాగా పెరిగిపోయింది.
ఫిలిం నగర్ చుట్టూ చక్కర్లు కొడుతు ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్ గా పెట్టుకుంటారేమో అని షూస్ అరిగేలా తిరుగుతున్నా రొజుల్లో అవుటర్ రింగు రోడ్డు యొక్క పదివేల తొమ్మిదో మలుపు వాళ్ళ పొలాన్ని రాసుకుంటూ పోవటం తో హటాత్తుగా కోటీశ్వరుడైపోయాడు, ఒక్కసారిగా అంత డబ్బులొచ్చి పడటం తో ఏమి చెయ్యాలో తోచక తొక్కలోది వీళ్ళ వెనక తిరగటం ఎందుకు తనే ఒక సినిమా తీసిపడేస్తే పోలా అని వెంటనే సినిమా కి శ్రీకారం చుట్టేశాడు.
స్వతహాగా పూరీ జగన్నాధ్ అభిమాని అవటం వల్లా టైటిల్ వెరైటి గా వుండాలని 'నసగాడు ' అనే పేరు ' వీడికి దురదెక్కువ ' అనే ట్యాగ్ లైన్ తో కొత్త వాళ్ళతో యూత్, ఫ్యాక్షన్ లవ్ స్టోరీ తొ తీసిపడేశాడు. సుబ్బిగారి డైరెక్షన్ లాజిక్కులకందగ పోయినా టేకింగు , టైటిలు వెరైటీ గా వుందని యూత్ సినిమా ని సూపర్ హిట్ చేసి పడేశారు. అలా మొదటి సినిమా నే సూపర్ హిట్ అవటం తో వెంటనే ఇక తన జీవితం అంతా ఈ వెండి తెర కే అంకితం అనుకొని ప్రాస కోసం ప్రాణమిచ్చే సుబ్బయ్య సిల్వర్ స్క్రీన్ సుబ్బు అయిపోయాడు. పేరు మార్చుకున్న వేళా విశేషమో చేతిలో డబ్బుల మహత్యమో యుత్ హీరోలంత సుబ్బు వెంట పడ్డారు, నెక్స్ట్ నా సినిమా నా సినిమా అని. ఎస్ ఎస్ సుబ్బు అప్పుడే ఎదుగుతున్న యూత్ హీరో ని పెట్టి కథ గురించి ఆలొచించకుండా టాలీవుడ్ లో అతి భారీ బడ్జెట్ సినిమా ప్రారంభించెసాడు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకూడాదని మొదటి సినిమా కన్నా గొప్ప టైటిల్ కావాలని ' శనిగాడు ' అనే పేరు ని, 'పట్టుకుంటే వదలడు ' అనే ట్యాగ్ లైన్ తో అనౌన్స్ చెసేశాడు. మొత్తానికి సినిమా ప్రారంభం అయ్యింది. కథ అంటు పెద్దగా లేక పోవటం తో ఎవొ ఒకటి అరా సీన్లు షూట్ చేస్తూ వస్తున్నాడు. రోజులు గడిచే కొద్దీ హీరో నాన్న, బాబాయ్, పిన్ని, అక్క , చెల్లి, బావా, మామ, వేలు విడిచిన మేనమామ, కాలు విడిచిన మేనత్త , కాలు వేలు రెండూ విడిచిన బీరకాయ పీచు చుట్టం, నిన్న కాక మొన్న పుట్టిన మేనకోడలు ఇలా ఒకరి తరువాత ఒక్కరు వచ్చి ఎవరికి వాళ్ళు డైరెక్షన్ లో వేలెట్టడం, స్టొరి ని మార్చటం తొ , అసలు లేని కథ ఔటర్ రింగ్ రోడ్డు అలైన్మెంటు కన్నా ఎక్కువ సార్లు మారిపోయింది. రీ షూట్ ల మీద రీ ష్ట్లు చెయ్యటం తో దెబ్బకు ఎస్ ఎస్ సుబ్బు కోట్లన్ని కరిగిపోయాయి. మొత్తానికి ఫైనాన్సర్ల సహాయం తో సినిమా పూర్తయ్యిందని పించుకున్నాడు. అలా 'శనిగాడు ' సినిమా విడుదలకి సిద్దం అయ్యింది. విడుదల రోజు ప్రేక్షకులు ఈ శనిగాడు ఎప్పుడు వదులుతాడా అనే టాక్ తో థియేటర్ల నుండి పారిపోయారు. పెద్ద సినిమా కి మొదటి రోజు డివైడ్ టాక్ మామూలే కదా అని సర్థి చెప్పుకున్నాడు. కానీ రెండో రోజు, మూడో రోజు గడచే కొద్దీ శనిగాడు సినిమా హాల్ దగ్గర జనాలు కూడా కనపడలేదు.
ఇదీ మన ఎస్ ఎస్ సుబ్బు గారి దిగులుకి కారణం. స్నేహితుల బలవంతం మీద బీరు - మీరు, బూందీ - బ్రాందీ (ఈ మధ్యనే వచ్చిన ఒక సినిమా లో డైలాగ్ ఇది, బాగా వుందని వాడుకున్నా ) ప్రోగ్రాం ఎట్టి స్నేహితులతో కూర్చొని, నా దారి హూసేన్ సాగరా , దుర్గం చెరువా అని మేధోమధనం చేస్తూ వుంటే, ఒక స్నేహితుడు గీతోపదేశం ప్రారంభించాడు.
నాయనా సుబ్బూ...సినిమా ఫట్ అవగానే నీ దారి హుసేన్సాగర్ దారి కాదు. పబ్లిసిటి అనే పాశుపతాశ్రం వుంది. ఈ మధ్య ఫ్లాప్ అనుకున్న సినిమాలన్నిటిని ఆదుకొనే ఒక కొత్త పబ్లిసిటి మాస్టర్ మంద క్రిష్ట్న వున్నాడు అతను కరుణిస్తే నీ సినిమా సూపర్ హిటే అని చెప్పాడు. సుబ్బు ఈ మాటలతో కాస్తా తేరుకున్నాడు. కట్ చేస్తే తరువాతి రోజు వుదయం సుబ్బు మందా ఆఫీస్ లో వున్నాడు. క్రిష్ట్న విషయం అంతా విని , చూడు సుబ్బూ, సినిమా హిట్ అవ్వాలంటే ఏదో ఒక వివాదం కల్పించి ప్రచారం చేస్తే సరి, దెబ్బకు ఎంత చెత్త సినిమా అయినా హిటయి వూరుకుంటుంది అన్నాదు. మళ్ళీ కట్ చేస్తే సాయంత్రం క్రిష్ట్న , సుబ్బు కూర్చొని సినిమా లో ని ప్రతి సీను చాలా జాగ్రత్తగా చూడసాగారు, ఒక సీన్లో నైనా , లేక ఒక డైలాగ్ లో నైనా ఏదో ఒక వివాదం కనిపిస్తుందో అని. వూ.. సినిమా మొత్తం నాలుగు సార్లు తిప్పి చూసినా అటువంటిది ఒక్కటి కూడా కనిపించలేదు. క్రిష్ట్న తన సలహాదారులు 'రాజా', జగ్గు ల సహాయం అడిగాడు. అయినా వీళ్ళు కూడా ఏమాత్రం సాధించలేకపోయారు. ఆ ఖండ ఖండాలు గా నరికిన సినిమాని అన్నిసార్లు చూసిన దెబ్బకి మైండ్ బ్లాక్ అయ్యి మోకాలు వాచి పోయింది మందా వారికి. కాలి వాపు తగ్గటానికి చిత్తు చిత్తు గా తాగి మత్తుగా పడుకున్నాడు. నిద్ర లో పాత జ్ఞాపకాలు.. అప్పుడెప్పుడొ తను పెట్టిన ఒక కేసులో ఇంకా జ్యోతి ఎం డి ని అరెష్టు చేయకపోవటం అనే బాధ గుండెల్లో కసుక్కున గుచ్చుకుంది. ఆ ఆలోచనలతో జ్యోతి ని ఎలా ఆర్పేయాలా అని ఆలోచన ఒక వైపు, 'శనిగాడు ' సినిమాని వివాదం చెయ్యటం ఎలా అనే ఆలోచన ఒక వైపు.. అలా ఆలోచిస్తుంటే మోకాలి లో ఒక మెరుపు.. అంతే మత్తు వదల్చుకొని వెంటనే తన అనుచరులని అందరినీ పిలిచి, మెరుపు ధర్నా ని ఆదేశాలు పాస్ చేశాడు. 'శని గాడు ' సినిమా లో ని అభ్యంతరకర సన్నివేశాలు వెంటనే తొలగించి వెంటనే దళితులందరికీ క్షమాపణ చెప్పాలి అని ... 24 గంటలలో జరగకపోతే సినిమా ప్రదర్సించే హాల్ మీద దాడి చేస్తాం అని ప్రకటనలు.
తెల్లారి లేసే సరికి అన్ని పేపర్లలో హెడ్డింగులో ' మంద ' వారి అల్టిమేటం.. ఇక జనాలందరిలో కుతూహలం ఆ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఎక్కడ వున్నాయా అని .. అలా సినిమా కి కలెక్షన్లు పెరిగాయి. 24 గంటలు గడచినా దర్శక , నిర్మాత కానీ సినిమా తరపున ఎవరూ క్షమాపణ చెప్పలేదు, సో ' మందా ' వారు అల్టిమేటం ని మరో 24 గంటలు పొడిగించారు. అలా ఒక వారం రోజులు లాగించ్గారు.. ఈ లోపు కలెక్షన్లు బాగా వూపందుకొని ఎస్ ఎస్ సుబ్బు కి ఆనందం కలిగించాయి. ఇంత జరిగినా ప్రేక్షకులు మాత్రం 'మందా ' వారి అభ్యంతరకర సీన్లు ఏవా అని బుర్రలు బద్దలు కొట్టూకోసాగారు. కొంత మందైతే ఈ సీను అభ్యంతరకం అంటె కాదు ఈ సీను అని పందేలు వేసుకోసాగారు. ఇన్ని గందరగోళాల మధ్య ' మందా ' వారు దీని మీద రోజుకో ప్రకటన చేసి చేతులు దులుపుకుంటున్నాడు. మరో పక్క పత్రికా విలేఖరులంతా 'మందా ' వారిని ఈ రోజెలాగైనా ఆ అభంతరకర సన్నివేశాల గురించి పట్టు బట్టాలని నిర్ణయించుకున్నారు. సో ప్రెస్ కాంఫరెన్స్ ప్రారంభమైంది.
వి : సార్, ఇన్ని రోజులుగా మీరు ఆందోళనలు చేస్తున్నారు, కానీ ఆ అభ్యంతరకర సన్నివేశాలు ఏవో చెప్పలేదు ?
మ : సినిమా దర్శక నిర్మాతలు తాము చెసిన తప్పు తెలుసుకొని సరిదిద్దుకుంటారని ఆశించాము. కానీ అలా చెయ్యలేదు. ఇది వీళ్ళ దురహంకారం. ఇలాంటి వాళ్ళకు మేము బుద్ది చెబుతాము.
వి : మరి ఆ సన్నివేశాలేంటొ చెబితే ...
మ : ఇలా మమ్ములని ఎన్ని రోజులు అవమానిస్తారు . .. ఇలాగే జరిగితే మేము తిరగబడే రోజు వస్తుంది....
వి : కానీ ఆ సన్నివేశాలు..
మ : సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా మాకు వెంటనే క్షమాపణ చెప్పాలి.
వి : సార్, అది ...
మా : ఆ రెండు పత్రికల అధిపతులు, విపక్షలదీ అందరిదీ దురహంకారమే.. మేము దాడులకు తెగబడతాం..
వి : సార్, కాస్తా ఆ సన్నివేశాలు వివరించండి ...
మా : మేము వీళందరి మీదా దాడి చేస్తాము.. ఎవరికీ భయపడం.. ఆనాడు గాంధీ , మళ్ళీ ఈ నాడు నేను..
వి : మీరు ఆ సన్నివేశాలు ఏంటొ చెబుతారా, సమావేశం ముగించమంటారా ?
మా : మీదీ దురహంకారమే.. మీ పేపరోళ్ళ మీద దాడి చేసినందుకు మేము గర్వ పడుతున్నాము... సర్లే చెబుతాను వినండి. ఆ సినిమా లో ఒక సన్నివేశం లో దేవుడి గుడి ముందు దీపం ఆరిపోబోతూ వుంటే హీరో, హీరో ఇన్ ఒకే సారి వచ్చి దీపం ఆరిపోకుండా చేతులు అడ్డం పెట్టారు. ఇది చాలా అభ్యంతరకరం
వి : { ఆశ్చర్యం తో నోట మాట లేదు.. }
మా : దీపం అంటే 'జ్యోతి ' .. అంటే ఆంధ్ర జ్యోతి పత్రిక.. అంటే మా మీద తప్పుడు వార్తలు రాసిన పత్రిక.. అలాంటి ఆరిపోతున్న జ్యోతిని హీరో ఆరిపోకుండా ఆపటమా.. మాకు ఇంత అవమానమా ?
వి : { అప్పటికి కాస్తా తేరుకొని } కానీ దేవుడి ముందు దీపం ఆరిపోగుండా వుంచటం లో కూడా వివాదమా ?
మా : ఆ సన్నివేశం అలాగే వుంటే తప్పులేదయ్యా.. కానీ ఆ సన్నివేశం లో ఎక్కడొ వెనకలు నిలబడిన ఒక వ్యక్తి చేతిలో జ్యోతి పేపర్ వుంది. అంటే ఈ దర్శకుడు కావాలని సింబాలిక్ గా అలా తీశాడు " అని ఆవేశం తో వూగిపోయారు మందా వారు..
ప్రేక్షకులు మళ్ళీ థియేటర్ వైపు క్యూకు.. ఆ సన్నివేశం చూడటానికి. పాపం ప్రేక్షకులు ఎంత కన్నులు విప్పార్చుకుని చూసినా ఆ సన్నివేశం లో ఎవరో లీలగా చేతిలో పేపర్ తో కనిపిస్తున్నారే కానీ అది జ్యోతి పేపర్ అని పోల్చుకోలేక పోయారు.
అలా.. ప్రేక్షకులను వదలకుండా వెంటాడుతూ సినిమా 'శనిగాడు - పట్టుకుంటే వదలడు ' అనే పేరు సార్థకం చేసుకుంది.
మందా వారికి పెద్ద మొత్తం సమర్పించుకున్నాడు సుబ్బు.
సినిమా హిట్ అయిన ఆనందం లో సుబ్బు గారు తరువాతి సినిమా 'దరిద్రుడు - వీడికి వొళ్ళంతా అదృష్తమే ' తో రెడీ అయిపోయాడు.
పాపం తెలుగు ప్రజలు.. ఇలాంటి చెత్త సినిమాలు చూసుకుంటూ , పిచ్చి రాజకీయాలు భరిస్తూ.. కాలం వెళ్ళదీస్తున్నారు........

Thursday, July 10, 2008

'సింబ్లీ' సిల్లీ జ్ఞాపకం ....

ఇది నేను +1 చదివేటప్పుడు. మాకు అప్పుడే కొత్తగా ఫిజిక్స్ , కెమిస్ట్రి కి ఇద్దరు కేరళ లేడీ టీచర్లు వచ్చారు. వాళ్ళు వచ్చిన మొదట్లో వాళ్ళ ఇంగ్లీషు సరిగా అర్థమైయేది కాదు. సింబ్లీ ( simply ) , వోళియం ( Volume ) లాంటి పదాలతో మొదటి కొన్ని రోజులు పాఠాలు అసలు అర్థం అయ్యేవి కావు. ఒక రోజు మా కెమిస్ట్రి మేడం స్లిప్ టెస్ట్ పెడుతోంది. స్లిప్ టెస్ట్ అంటే టీచరు ప్రశ్నలు చెబుతుంటే మేము ప్రశ్నలు పేపర్ మీద రాసుకోవాలి. ఆ తరువాత దూరం దూరం గా కూర్చొనిజవాబులు రాయాలి. మేడం చెబుతున్న ప్రశ్నలలో ఒకటి What is Dry Ice ? And Why is it so Called ? కేరళా వాళ్ళూ 'కా' ని 'కో' అని పలుకుతారు కదా.. సో మా వాళ్ళు అందరూ ప్రశ్నని ఇలా రాసుకున్నారు. What is Dry Ice? And Why is it so Cold ? ఇక ప్రశ్నలు అయిపోగానే జవాబులు రాసి పేపర్లు మేడం కి ఇచ్చేశాము.స్లిప్ టెస్ట్ అయిపోగానే మా ఫ్రెండ్స్ తో ఒక్కో దాని జవాబు చర్చించుకుంటున్నాము. (అప్పట్లో ఏ పరీక్ష కానీ అయిపోగానే జవాబులు తోటి వాళ్లతో చచించి, మనం రాసినవి కరెక్టే అని ప్రూవ్ చేసుకోవటం అనేది ఓ తుత్తి , ఇంకా పోటీ తత్వం కూడాను ) ఈ ప్రశ్న రాగానే మా ఫ్రెండ్ ఒకతను చెప్పిన జవాబు... డ్రై ఐస్ అంటే చెప్పి అది ఐస్ కాబట్టి మరీ చల్లగా వుంటుంది అని చెప్పాడు. అంతే అది వినగానే మేమంతా పడి పడి నవ్వాము. ఆ తరువాత విషయం క్లాస్ లో చెబితే చాలా మంది అవును అది కరెక్టే కదా.. 'ఐస్ కాబట్టి అది మరీ చల్లగా వుంటుంది అని ' అని, వాళ్ళంతా అదే రాశామని చెప్పారు. సరే అని వాళ్లకు విడమరచి చెప్పాము.. ప్రశ్న 'why is so called ?'.. అది 'cold' కాదు అని. (డ్రై ఐస్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఐస్ రూపం లో. దానిని డ్రై ఐస్ అని ఎందుకంటారంటే ఇది కరిగిన తరువాత ద్రవ పధార్థం లా కాకుండా నేరుగా కార్బన్ డైఆక్సైడ్ వాయు పధార్థం గా మారుతుంది కాబట్టి) ఆ తరువాత సమాధానాలు చదివిన మేడం గారు కూడా తెగ నవ్వు కున్నారు లెండి..

Tuesday, April 1, 2008

గుర్తుకొస్తున్నాయి -- 'అంతం'

నేను 7 వ తరగతి నుండి నవోదయా స్కూల్ లో చదివాను. చిత్తూర్ జిల్లా లో మేము చదివేటప్పుడూ స్కూల్ హార్సిలీ హిల్స్ లో ఉండేది. అక్కడ స్కూల్ తప్ప వేరే ఎంటర్తైన్మెంట్ ఉండేది కాదు. కొండ పైకి బసు రోజు కి 3 సార్లు మాత్రమే వచ్చేది. అది కాక వేరే బస్ అంటే 10 కిలో మీటర్లు కొండ దిగితే అక్కడ నుండి మదనపల్లి కి బస్సులు ఉండేవి. సినిమాలు చూడగలిగే దగ్గర ప్లేసు అంటె మదనపల్లే. నేను 9 వ తరగతి చదివేటప్పుడు రాజావిక్రమార్కా సినిమా రిలీజ్ అయ్యింది. మా క్లాస్ లో ప్రదీప్ అని ఒక్క చిరు వీరాభిమాని. సినిమాల పిచ్చి బాగా ఉన్నవాడు ఉండేవాడు. అక్కడ స్కూల్ లో చదవటం అంటె జైలు లో ఉన్నట్లే. కేవలం ఆదివారం మాత్రం పేరెంట్స్ ని కలుసుకొనే అవకాశం. సండే కూడా రోజూ ఈవెనింగు రోల్ కాల్ ఉండేది. ఇలాంటి పరిస్థితి లో ప్రదీప్ కి ఎలగైనా రాజా విక్రమార్క చూడాలనిపించింది. సో తను , ఇంకో ఫ్రెండు ఓం ప్రకాష్ ఇద్దరూ కలసి ప్లాన్ చేసారు. ఆదివారం వుదయం 6 కంతా లేచి ఎవరి కంటా పడకుండా కొండ పైన నుండి బయలు దేరారు నడచి. దిగేటప్పుడు అడ్డ దారులన్నీ పట్టి 10 కిలో మీటర్లు దిగి అక్కడ నుండి బసు పట్టుకొని మదనపల్లి చేరారు. చేరి రాజా విక్రమార్కా చూసారు. చూసి తిన్నగా బయలు దేరి పైకి రావచ్చు కదా. ఎలాగూ ఇంత కష్ట పడి మదనపల్లి వరకు వచ్చాము కదా అని ఇంకో సినిమా ఉంటే దానికి చెక్కేసారు. సాయంత్రం అయ్యింది. రోల్ కాల్ లో వాళ్ళు మిస్సింగు. మేము ఎవ్వరమూ నిజం చెప్పలేదు. మా టీచర్లూ రోజంతా చూసారు. పాపం వాళ్ళు బాగా కంగారు పడ్డారు. మాకూ వాళ్ళూ ఏమైయ్యారో అని భయపడ్డాము. ఇక్కడా మేమంతా ఇలా కంగారు పడుతుంటే వాళ్ళూ ఇద్దరూ తరువాతి రోజు వుందయం నవ్వులు చిందిస్తూ బసు దిగారు. అప్పటికే మా టీచర్ల కీ వాళ్ళూ సినిమాకి వెళ్ళీన విషయం చెప్పేసారు కొందరు సిన్సియర్ స్టూడెంట్సు. ఇక ఆ రోజు మొత్తం వాళ్ళకు పనిష్మెంట్లే. వాళ్ళు పనిష్మెంట్ అనుభవిస్తూ కూడా మేము అలా వచ్చి వెళ్ళుతుంటే సినిమా భలే ఉంది అని నవ్వుతూ చెప్ప సాగారు. వాళ్ళు మొత్తానికి మా అందరికీ సినిమాలు చూసే ఒక దారి చూపించారు. విమానం కనిపెట్టిన రైట్ సోదరుల లాగా, వీళ్ళు రూట్ సోదరులన్నమాట (మా అందరికీ రూట్ చూపించారు కదా ) కొన్ని రోజుల తరువాత ఒక్క సండే ఆపద్భాంధవుడు కి నేనూ వెళ్ళాను అలా 10 కిలోమీటర్లు నడచి. కానీ నేను చూసి సాయంత్రం కల్లా వెన్నక్కి వచ్చేసా. అంత కష్టపడి నేను వెనక్కు వచ్చేసినా ఆ రోజు రోల్ కాల్ జరగలేదు. అలా జనాలు అంతా ఆదివారం రావటం సినిమాలకి వెళ్ళి రావటం సాధారణమైపోయింది. ప్రతి ఆరంభానికీ ఒక అంతం వుంటుంది కదా. అలాంటి అంతం నాగార్జునా సినిమా 'అంతం' రూపము లో వచ్చింది. అంతం సినిమా రిలీజ్ అవ్వగానే ఆ సినిమా కి ఇదేవిధం గా వెళ్ళారు మా ఫ్రెండ్స్ గ్యాంగు. వాళ్లలో ఒక్కతను అప్పటి మినిష్టరు కొడుకన్నమాట. వాళ్ళ దురదృష్టం కొద్ది ఆ రోజు మా ఫ్రెండు వాళ్ళ నాన్న గారు మా ఫ్రెండు కోసమని వచ్చారు. వచ్చి తన కోసం అడిగేసరికి మా టీచర్లంతా బాగా హైరానా పడిపోయారు. నాకు విషయం తెలిసినా చెప్పలేదు. ఇక స్కూల్ జీప్ తీసుకొని వెతకటానికి బయలుదేరారు ప్రిన్సిపాల్ తో సహా. చివరికి సినిమా చూసి రెటర్న్ వచ్చేటప్పుడు దారి లో దొరికిపోయారు 'అంతం' గ్యాంగు. ఈ దెబ్బతో ఆదివారాలు మమ్ములని బాగా కట్టడి చేసారు, సినిమాల సందడీ తగ్గిపోయింది. అలా 'అంతం' సినిమా మా సినిమా పిచ్చి అంతం చూసిందన్నమాట.