Monday, January 12, 2009

మా వూళ్ళో సంక్రాంతి


నాకు చాలా ఇష్టమైన పండుగ సంక్రాంతి. మా వైపు పెద్ద పండుగ అంటారు (పెద్దల పండుగ, అన్నిటికన్నా పెద్ద పండుగ అని రెండు అర్థాలు ) . ఇప్పుడు పెద్ద హడావిడి కనిపించటం లేదు కానీ, మా చిన్నప్పుడు చాలా సంబరం గా జరిగేది పండుగ మూడు రోజులు. ధనుర్మాసం ప్రారంభం తోనే పండుగ హడావిడి మొదలవుతుంది వూరిలో. అంతా కొత్త బట్తలు కొనటం , కుట్టించుకోవటానికి టైలర్ దగ్గర క్యూలు. ఇంకా ధనుర్మాసం మొదటి రోజు నుండి ఇళ్ళముండు పెద్ద పెద్ద ముగ్గులు, గొబ్బెమ్మలు, వాటి కి గుమ్మడి, తంగేడూ పూలతో అలంకరణలు వీటితోపాటే శితాకాలపు చలి , మంచు తో ఆ పల్లెటూరి అందాలు ద్విగుణీకృతం అవుతాయి. రోజూ స్కూల్ నుండి వచ్చేటప్పుడు దారిలో గుమ్మడి పూలు చాటుగా కోసుకు రావటం , ఎవరి ఇంటి ముందు ఎక్కువ గొబెమ్మలు , గుమ్మడి పూలు పెట్టరు అని పిల్లల మధ్య పందేలు ఇవన్నీ చాలా చాలా మంచి జ్ఞాపకాలు. ఇక భోగి ముందు రోజు సాయంత్రం స్కూల్ నుండి రాగానే చెరుకు తోటల లో పడి ఎండు చెరుకు ఆకులను మోపులుగా కట్టి తెచ్చి ఇంట్లో పడేయటం ఇంట్లో భోగి మంటలో వేయటానికి పనికి వచ్చే పాత సామాను అంతా పోగేయటం ఎప్పుడెప్పుడు ఉదయం అవుతుందా అని ఆత్రం గా ఎదురు చూడటం. ఉదయం మూడూ కి అంతా మా పెద నాన్న, తాత గారు నిద్ర లేపే వాళ్ళూ అందరినీ , మళ్ళీ ఎవరిది పెద్ద మంటా ఎవరిది చాలా సేపు కాలుతుంది అని మళ్ళి పందేలు. అప్పట్లో చలి కూడా బాగా ఉండేది సో భోగి మంట బాగా ఎంజాయ్ చెసే వాళ్లము. ఆ తరువాత చాకలి తో తలంటు, వాళ్ళ బలమంత చూపించి మర్దన చేసే వాడు. వొళ్ళంతా హూనమైయేది. ఇక ఆ నూనె జిడ్డూ మొత్తం పోవాలంటే గిన్నెడు కుంకుడు కాయరసం తో చేస్తే తప్ప వదిలేది కాదు. ఆ రోజంత ఇక పెద్దగా ఏమీ వుండేది కాదు ఏవో స్వీట్స్ వండటం తప్ప.రెండొ రోజు సంక్రాంతి, ఈ రోజు ఉదయం ఉపవాసం , మధ్యాహనం పూజ ఆ తరువాత చనిపోయిన పెద్దలకి బట్టలు పెట్తడం అయిన తరువాత భోజనాలు. సాయంత్రం పిల్లాంతా కలసి సరదాగా మామిడి తోటలోకో లేక చెరకు తోట కో వెళ్ళీ రేగు పళ్ళు కోసుకొని, కాలువలో నీళ్ళతో కాసేపు ఆడుకొని వచ్చే వాళ్ళము.
ఇక మూడో రోజు కనుమ, మా వైపు పశువుల పండుగ అని కూడా అంటారు. తెల్ల వారుఝామునే ఊరి మధ్యలో ఉన్న సత్యమ్మ దేవత దగ్గర పొంగళ్ళు పెట్టే వాళ్ళు. ఆ ప్రసాదం వూళ్ళొ అందరూ తప్పకుండ తినే వాళ్ళు. చాలా మంచి జరుగుతుంది అని నమ్మకం. ఆ తరువాత ఇంట్లో ఆవులను , ఎద్దులను బావి దగ్గరకు తీసుకు వెళ్ళి వాటిని కడిగి, కొమ్ములకు రంగులు వేసి, తరువాత వాటి కొమ్ములను పలకలు (అంటే చెక్కతో రకరకాల రూపాలలో చెక్కిన బొమ్మలు లాంటివి) , బెలూన్లు , రంగు కాగితాల తో అలకరించే వాళ్ళము. ఉదయం 10 కి అంతా ఊరిలో ఎడ్ల పందేలు ప్రారంభమైయేవి. ప్రతి ఒక్కరు వాళ్ళ ఎడ్లను పట్టుకొని వాటితో పాటు పరిగెత్తే వారు. మధ్యలో ఎవరైనా పట్టుకొని ఎద్దుని లొంగదీసుకొని వాటికి ఉన్న పలకలు లాకొనే వాళ్ళు. అలా ఎవరు ఎక్కువ పలకలు లాకుంటే అంత గొప్ప అన్నమాట. మేమంతా వీది అరుగుల మీద , మెద్దెల మీద నిల్చొని ఈ పోటీలు చూసే వాళ్ళము. ఇవన్నీ అయిపోగానే కుదిరితే పక్క వూళ్ళో పోటీలు కూడా చూసి వచ్చే వాళ్ళము. ఈ పోటిలు చాలా సందడిగా ఉండేవి. ఈ పోటీలు అయిపోగానే పశువులన్నిటిని మేత కోసం ఫ్రీగా అడవులలోకి వదిలేసే వాళ్ళు. మా ఇంట్లో అయితే మా బంధువులంతా కలిసే వాళ్ళము ఈ రోజు. చిన్న పిల్లలందరితో కలిపి 35-40 మంది అయ్యే వాళ్లము ఇంట్లో. అసలు అంత మంది తో ఎంత సందడి సందడి గా ఉండేదో ఇల్లు. మళ్ళి సాయంత్రం ఊరి బయట కాటారజుల దేవుళ్ళు అని కొన్ని చిన్న విగ్రహలు ఉంటాయి అక్కడ పొంగళ్ళు పెడుతారు. దాదాపు ఊరిలో జనాలంతా అక్కడా చేరే వాళ్ళు. చుట్టు పక్కల ఉన్న బీడు భుములలో ఆటలు పాటలు జరిగేవి పొగళ్ళు జరుగుతున్నంత సేపు. ఇక చివరి ఘట్టం చిట్లా కుప్ప. పొంగళ్ళు దేవుడికి నైవేద్యం పెట్టి ఓ వైపు ఎండు చెరుకు ఆకు తో పెద్ద మట వేసే వాళ్ళు. ఇక కుప్పకి ప్రతి సంవత్సరం ఎవరో ఒక పెళ్ళీడు కి వచ్చిన కుర్రాళు మంట పెట్టే వాళ్ళు. అది కూడా ఈ కుర్రాడు దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చి మంట పెడుతుంటే వేడి పొంగలి ముద్ద తో వాళ్ళ వెనుక కొట్టే వాళ్ళు. అలా చేస్తే త్వరలో ఆ కుర్రాడికి పెళ్ళి కుదురుతుందని నమ్మకం. ఇక ఆ చిట్లా కుప్ప మండుతుండగానే అడవులలోకి వదిలిన పశువులన్నిటిని తోలుకు వచ్చే వాళ్ళు. ఆ మంటతో ఆ పశువులకు దిష్టి తీసినట్టు ఉండె లా మంట పక్క నుండి వెళ్లనిచ్చే వాళ్ళు. అంతా అయిపోయినతరువాత ప్రసాదం తిని చీకటి పడుతుండగా ఇల్లు చేరే వాళ్ళము.
ఆ చివరి రోజు ఎంత సరదాగా గడచిపోయేదో. 2001 లో చివరిసారి మా వూళ్ళో సంక్రాంతి చూసా, ఆ తరువాత నుండి దాదాపు అన్ని సంక్రాంతులు మిస్ అవుతూనే ఉన్నా.. :(
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు :)

8 comments:

ప్రపుల్ల చంద్ర said...

బాగున్నాయి మీ ఙ్ఞాపకాలు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

ఏకాంతపు దిలీప్ said...

నిరంజన్ గారు మీది ఏ ఊరు? ఊరి పేరు చెప్పకపోయినా జిల్లా పేరు అయినా చెప్పొచ్చు.. :-) మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.. :-)

చిలమకూరు విజయమోహన్ said...

మీ కుటుంబానికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు

విహారి(KBL) said...

మీకూ సంక్రాంతి శుభాకాంక్షలు.

Niranjan Pulipati said...

ధన్యవాదాలు ప్రపుల్ల గరు , దిలీప్ గారు , విజయమోహన్ గారు, విహారి గారు :)
దిలీప్ గారు మాది చిత్తూర్ జిల్లా లో చంద్రగిరి దగ్గర పల్లెటూరు. మీరూ అటు వైపు వారే నా ?

Anonymous said...

ఏంటండీ? చాకలితో తలంటా? మీ జిల్లాలో అలా చేస్తారా? తెలుసుకుందామని.

మధురవాణి said...

నిరంజన్ గారూ..
బావున్నాయి మీ జ్ఞాపకాల ఊసులు :)
మీకూ మీ కుటుంబానికీ.. సంక్రాంతి శుభాకాంక్షలు..!!

ఏకాంతపు దిలీప్ said...

లేదండీ మాది గోదారి :-)