Tuesday, April 1, 2008

గుర్తుకొస్తున్నాయి -- 'అంతం'

నేను 7 వ తరగతి నుండి నవోదయా స్కూల్ లో చదివాను. చిత్తూర్ జిల్లా లో మేము చదివేటప్పుడూ స్కూల్ హార్సిలీ హిల్స్ లో ఉండేది. అక్కడ స్కూల్ తప్ప వేరే ఎంటర్తైన్మెంట్ ఉండేది కాదు. కొండ పైకి బసు రోజు కి 3 సార్లు మాత్రమే వచ్చేది. అది కాక వేరే బస్ అంటే 10 కిలో మీటర్లు కొండ దిగితే అక్కడ నుండి మదనపల్లి కి బస్సులు ఉండేవి. సినిమాలు చూడగలిగే దగ్గర ప్లేసు అంటె మదనపల్లే. నేను 9 వ తరగతి చదివేటప్పుడు రాజావిక్రమార్కా సినిమా రిలీజ్ అయ్యింది. మా క్లాస్ లో ప్రదీప్ అని ఒక్క చిరు వీరాభిమాని. సినిమాల పిచ్చి బాగా ఉన్నవాడు ఉండేవాడు. అక్కడ స్కూల్ లో చదవటం అంటె జైలు లో ఉన్నట్లే. కేవలం ఆదివారం మాత్రం పేరెంట్స్ ని కలుసుకొనే అవకాశం. సండే కూడా రోజూ ఈవెనింగు రోల్ కాల్ ఉండేది. ఇలాంటి పరిస్థితి లో ప్రదీప్ కి ఎలగైనా రాజా విక్రమార్క చూడాలనిపించింది. సో తను , ఇంకో ఫ్రెండు ఓం ప్రకాష్ ఇద్దరూ కలసి ప్లాన్ చేసారు. ఆదివారం వుదయం 6 కంతా లేచి ఎవరి కంటా పడకుండా కొండ పైన నుండి బయలు దేరారు నడచి. దిగేటప్పుడు అడ్డ దారులన్నీ పట్టి 10 కిలో మీటర్లు దిగి అక్కడ నుండి బసు పట్టుకొని మదనపల్లి చేరారు. చేరి రాజా విక్రమార్కా చూసారు. చూసి తిన్నగా బయలు దేరి పైకి రావచ్చు కదా. ఎలాగూ ఇంత కష్ట పడి మదనపల్లి వరకు వచ్చాము కదా అని ఇంకో సినిమా ఉంటే దానికి చెక్కేసారు. సాయంత్రం అయ్యింది. రోల్ కాల్ లో వాళ్ళు మిస్సింగు. మేము ఎవ్వరమూ నిజం చెప్పలేదు. మా టీచర్లూ రోజంతా చూసారు. పాపం వాళ్ళు బాగా కంగారు పడ్డారు. మాకూ వాళ్ళూ ఏమైయ్యారో అని భయపడ్డాము. ఇక్కడా మేమంతా ఇలా కంగారు పడుతుంటే వాళ్ళూ ఇద్దరూ తరువాతి రోజు వుందయం నవ్వులు చిందిస్తూ బసు దిగారు. అప్పటికే మా టీచర్ల కీ వాళ్ళూ సినిమాకి వెళ్ళీన విషయం చెప్పేసారు కొందరు సిన్సియర్ స్టూడెంట్సు. ఇక ఆ రోజు మొత్తం వాళ్ళకు పనిష్మెంట్లే. వాళ్ళు పనిష్మెంట్ అనుభవిస్తూ కూడా మేము అలా వచ్చి వెళ్ళుతుంటే సినిమా భలే ఉంది అని నవ్వుతూ చెప్ప సాగారు. వాళ్ళు మొత్తానికి మా అందరికీ సినిమాలు చూసే ఒక దారి చూపించారు. విమానం కనిపెట్టిన రైట్ సోదరుల లాగా, వీళ్ళు రూట్ సోదరులన్నమాట (మా అందరికీ రూట్ చూపించారు కదా ) కొన్ని రోజుల తరువాత ఒక్క సండే ఆపద్భాంధవుడు కి నేనూ వెళ్ళాను అలా 10 కిలోమీటర్లు నడచి. కానీ నేను చూసి సాయంత్రం కల్లా వెన్నక్కి వచ్చేసా. అంత కష్టపడి నేను వెనక్కు వచ్చేసినా ఆ రోజు రోల్ కాల్ జరగలేదు. అలా జనాలు అంతా ఆదివారం రావటం సినిమాలకి వెళ్ళి రావటం సాధారణమైపోయింది. ప్రతి ఆరంభానికీ ఒక అంతం వుంటుంది కదా. అలాంటి అంతం నాగార్జునా సినిమా 'అంతం' రూపము లో వచ్చింది. అంతం సినిమా రిలీజ్ అవ్వగానే ఆ సినిమా కి ఇదేవిధం గా వెళ్ళారు మా ఫ్రెండ్స్ గ్యాంగు. వాళ్లలో ఒక్కతను అప్పటి మినిష్టరు కొడుకన్నమాట. వాళ్ళ దురదృష్టం కొద్ది ఆ రోజు మా ఫ్రెండు వాళ్ళ నాన్న గారు మా ఫ్రెండు కోసమని వచ్చారు. వచ్చి తన కోసం అడిగేసరికి మా టీచర్లంతా బాగా హైరానా పడిపోయారు. నాకు విషయం తెలిసినా చెప్పలేదు. ఇక స్కూల్ జీప్ తీసుకొని వెతకటానికి బయలుదేరారు ప్రిన్సిపాల్ తో సహా. చివరికి సినిమా చూసి రెటర్న్ వచ్చేటప్పుడు దారి లో దొరికిపోయారు 'అంతం' గ్యాంగు. ఈ దెబ్బతో ఆదివారాలు మమ్ములని బాగా కట్టడి చేసారు, సినిమాల సందడీ తగ్గిపోయింది. అలా 'అంతం' సినిమా మా సినిమా పిచ్చి అంతం చూసిందన్నమాట.

13 comments:

Anurup said...

nice story.

Anonymous said...

బాగు౦ది....

Naveen Garla said...

రాజా విక్రమార్క మధుసూదనా ధియేటర్ లో విడుదలైంది అనుకుంటా. ఇప్పుడు మూతపడిపోయింది. ఈ ధియేటర్ బంధువుల అమ్మాయినే అనుకుంటా హీరో వెంకటేష్ పెళ్ళి చేసుకొంది. అమ్మాయి పేరు నీరజ అని గుర్తు. మొదట్లో అత్తగారిల్లు అని ప్రతి సంవత్సరం మదనపల్లి వచ్చేవాడు(అట).
హార్స్లీహిల్సు ఇంకా అలానే ఉంది, అన్టచ్డ్. టూరిజమూ గోలా లేకుండా ప్రకృతిని అలా వదిలేస్తేనే బాగుంటుంది.

(http://gsnaveen.wordpress.com)

Niranjan Pulipati said...

అయ్యొ అది స్టోరి కాదండి.. నిజంగ జరిగినవే. @అనురూప్ గారు . any ways థాంక్సు అండి నచ్చినందుకు :)
ధన్యవాదాలు అండి శంకర్ రెడ్డి గారు :)
నవీన్ గారు అవును మధుసూధనా లో నే రిలీజ్ అయ్యింది. అవును హార్స్లీ హిల్స్ అలా వదిలెస్తేనే చాలా బాగుంటుంది. మళ్ళీ ఒక్క సారైనా అక్కడైకి వెళ్ళాలని కోరికైతే వుంది కానీ కుదరటం లేదు.. :( నాకూ చాలా నచ్చింది ఆ ప్లేసు..

కొత్త పాళీ said...

బావున్నై, చిన్నప్పటి జ్ఞాపకాలు. అది హాస్టల్ అని కథనం మొదట్లో చెప్పక పోవటం వల్ల కొంచెం అయోమయం, రోల్ కాల్ ప్రస్తావన దాకా.
మా హైస్కూలైతే విజయవాడ గణద ల రాంగోపాల్ థియెటరుకి ఎద్దురుగా ఉండేది, ఎవడీదగ్గరా డబ్బులే ఉండేవి కావు, స్కూలెగ్గొట్టి వెళదామన్నా!

పద్మ said...

కెవ్వ్ నిరంజన్ గారూ. బావున్నారా? :) ఇది మన టి.పి. 'గుర్తుకొస్తున్నాయి ' లో పోస్ట్ చేసిన అనుభవమే కదా. నాకు అప్పుడు సురేష్ గారు చేసిన కామెంట్స్ ఇంకా గుర్తున్నాయి. :)

ఎలా ఉన్నారు? ఏంటసలు పూర్తిగా మాయం అయిపోయారు?

థాంక్స్ నా బ్లాగ్ నచ్చినందుకు, లింకినందుకు. :)

నిషిగంధ said...

:))) మీ రూట్ సోదరులు ఇంకా గుర్తున్నారు నాకు..

పద్మా, ఏంటీ టి.పి., గుర్తుకొస్తున్నాయి, సురేష్ అంటూ అర్ధం కాని భాష మాట్లాడుతున్నావు!? :p:p

Anonymous said...

హార్సీలీ హిల్సు లో ఒక హై స్కూల్ వుందనుంకుంటా. ఆ హెడ్మాస్టర్ ఎన్నో మంచి పనులు చేస్తున్నట్టు విన్నాను.

రిషి వేలీ లో చదివిన ఒకతను మా జూనియెర్ గా వుండే వాడు. పేరు సుమన్‌ అనుకుంటా.

అవును మధుసూధన థియేటర్ అంటే వెంకటేశ్వర గుడి దగ్గర, పోలీస్ స్టషన్‌ కు అవతల వున్నదేనా? జ్యోతి, పంచరత్న, శేష మహల్, ఉషా, మల్లికార్జున అన్నీ గుర్తుకొస్తున్నాయి కానీ ఈ ఒక్కటి ఎక్కడుందో గుర్తుకు రావట్లేదు.

-- విహారి

Niranjan Pulipati said...

ధన్యవాదాలు @ కొత్త పాళీ గారు :)

పద్మ గారు , నేను బాగున్నాను. మీరెలా వున్నారు ? ఆ మధ్య కొద్దిగా బిజీ గా వున్నాను. గత నెల నుండి కాస్తా తీరిక దొరికితే బ్లాగు బూజు దులిపాను. :) అవును ఇది టిపి లొ దే . మరీ ఎప్పుడూ రాజకీయాలే అంటే బోరు కదా అని... మీ బ్లాగు చాలా రోజుల నుండి చూస్తున్నా. చాలా బాగుంది. పాత పాటలు వాటి అర్థాలు very nice..

:)) @ నిషి ...
ఊసులాడె ఒక జాబిలట తరువాయి భాగం ఇంకా రాలేదేంటి ?

Niranjan Pulipati said...

@ విహారి గారు , హార్సిలీ హిల్స్ లో మొత్తం 3 స్కూల్స్ వుండేవి, మాది నవోదయ, ఇంకా ఒక ప్రవేట్ స్కూల్ (స్కూల్ పేరే హార్స్లీ హిల్స్ స్కూల్ ), ఇంక రిషి వేలీ.
మదనపల్లి నాకు కూడా అంతగా గుర్తు లేదండీ. 15 సంవత్సరాలు దాటింది కదా , మధుసూదన పోలీస్ ష్టేషన్ పక్కనే అని నాకూ గుర్తు.

శ్రీ said...

మదనపల్లిలో మా పెద్దక్క, బావ ఉండేవాళ్ళు. అక్కడ హార్సిలీహిల్ల్స్ చాల అద్భుతంగా ఉండేది. నేను యముడికి మొగుడు రిలీజ్ రోజు చూసాను, మీరూ వచ్చారా? నాకూ చిన్నప్పటి నుండీ స్కూలు ఎగ్గొట్టి సినిమాలు చూసిన అనుభవాలు చాలా ఉన్నాయి. ఇపుడు అవన్ని గుర్తుకు వస్తున్నాయి.

Naveen Garla said...

విహారి, వెంకటేశ్వర సామి గుడి నుంచి ఎడమ వైపు ఉన్నదే మధుసూధనా. పేర్లన్నీ భలే గుర్తుపెట్టుకున్నావే :)
యముడుకి మొగుడు సినిమా చూడటానికి జ్యోతి థియేటర్‌కు 94వ రోజు వెళ్ళాను. అప్పటీకి ఇంకా HouseFul, హిట్టంటే అదీ :)

Kathi Mahesh Kumar said...

అన్నోయ్..కెవ్వు కేక.
మీరు చూపిన ‘రహదారిలో’ కొండదిగి సినిమాలు చూసిన జూనియర్లలో మనమూ ఉన్నాం. ఆ అనుభవాలే వేరు...తలుచుకుంటుంటే ఒళ్ళు పులకరిస్తోంది.మన టిచర్ల మీద హార్స్లీహిల్స్ లో జరిగిన సినిమా షూటింగుల మీదా అర్జంటుగా ఒక టపా రాయాలని ఆవేశం వచ్చింది. రాసేస్తా...రాసేస్తా.